సంస్కృతి - సాహిత్యం వేరు వేరు అని ఒక పెద్దాయనెవరో సెలవిచ్చారు...
నిజమా? ఈ విషయం నాకిప్పటిదాకా తెలియదు నిజంగా...!!
నేనింకా సాహిత్యం - సంస్కృతి రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది... సంస్కృతి లోంచే సాహిత్యం పుడుతుంది.... సాహిత్యం పై సంస్కృతి ప్రభావం పడుతుంది అనే భ్రమల్లోనే ఉన్నానిన్నాళ్లూ...!! సంస్కృతి అంటే మనిషి తాలూకు జీవన సంవిధానాన్ని ప్రతిబింబింపజేసేది అని, సమాజపు స్థితిగతులకి కొలమానంగా నిలిచేది అనే అనుకుంటున్నా ఇన్నేళ్ళు...!!
సంస్కృతి - సాహిత్యం వేరు అయినప్పుడు, తాలిబాన్ దేశస్థులు తెలుగులోనూ ... భారతీయులు ఉగాండా లోనూ సాహిత్యం వ్రాయడం లేదు ఎందుకో అర్ధం కాదు మరి...
ఓహ్... ఇప్పుడు సంస్కృతి - సాహిత్యం కాకుండా మళ్లీ భాష అనేది ఒకటి మధ్యలో వస్తుంది కాబోలు... పై రెండూ వేరు - వేరు అయినప్పుడు- భాష కూడా వేరే అయి ఉంటుంది మరి...తప్పులేదు...!!
పచ్చ గడ్డి - ఎండు గడ్డి ఉంటుంది కానీ,
"పచ్చ గడ్డి" కోసేటీ పడుచు పిల్లా... ఏమిటి అని సదరు పెద్దాయన - ఆయన ఫ్రెండులుంగారూ తెగ నవ్వేసుకున్నారట. ప్రజల జీవనం తెలియని వాళ్ళు వ్రాసే రాతలట అవి.
ముందుగా ఒక్క మాట చెప్పుకోవాలి....ఆ పాట సృష్టికర్త...."ఆచార్య" ఆత్రేయ . అయ్యా..... పేరు వినిపిస్తోందా..... "ఆ.....త్రే.... య" . ఆయనకా ప్రజల జీవనం పై అవగాహన లేదు అన్నది? ఆయనకా భాష మీద పట్టు లేకుండా ఏవేవో రాసింది అన్నది? నిజమే, క్విట్ ఇండియా ఉద్యమంలో దేశం తరపున పోరాడి అరెస్టైన ఆయనకంటే ప్రజల జీవనం గురించి మనకే ఎక్కువ తెలుసు. అలతి - అలతి పదాలతో కోట్లాది గుండెలకి తన కలాన్ని గొంతుక చేసిన అక్షర మాంత్రికుడుకి సినిమా పాట ఎలా రాయాలో మనమే నేర్పించాలి మరి .
ఏమిటేమిటి... " పచ్చి గడ్డి ఉంటుంది - ఎండు గడ్డి ఉంటుంది... మధ్యలో ఈ పచ్చి గడ్డి ఏమిటి" నా? హాహాహాహా....
పచ్చని పంట పొలాలు - పచ్చని చెట్లు ( బహుశా పచ్చి చెట్లు - ఎండు చెట్లు అనాలేమో మీ భాషలో...సారీ...) అనే మాటలు బహుశా మీరెప్పుడూ విని ఉండరేమో మరి. ఆకుపచ్చని గురించి చెప్పేటప్పుడు "పచ్చ" అని వాడటం సర్వసాధారణం. తెలుగు సినిమా పాట ప్రాధాన ఉద్దేశం శ్రోతలని రంజింపజేయడం. ఆ క్రమంలో బాణీని - సందర్భాన్ని - హీరో హీరోయిన్ల ఇమేజిని - దర్శకుడి అభిరుచిని - వ్యాపార సూత్రాలని దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన రచన "సినిమా పాట". అందుకు ఎన్నో చమక్కులు - ఉపమానాలు వగైరాలని కవి ఆశ్రయిస్తాడు.
ఈ విషయాలేవీ తెలియకుండానే ఆత్రేయ "పచ్చ గడ్డి" అని రాసేసి ఉంటాడు. ఆయన బ్రతికుంటే "తెలుగు భాష గురించి - తెలుగు సినిమా పాట ఎలా వ్రాయలో అని విషయం గురించి మన దగ్గరికి ట్యూషన్ కి రమ్మందును... మంచి ఛాన్స్ మిస్సయ్యాడు ముసలాయన పాపం...!!"
"భూమీకి పచ్చాని రంగేసినట్టు...." అనే పాటకి మరి అర్ధమేమిటో... ఇందులో పచ్చాని అనే పదానికి అర్ధం ఏమిటో ... అది వ్రాసిన కవి ఉద్దేశం ఏమిటో కూడా మీ మేధస్సుని ఉపయోగించి చెప్తే నాలాంటి అర్భకులు ఆనందిస్తారు. ఇకపైన ప్రతీ సినిమా పాటని మీ వద్దకే పోస్ట్ మార్టమ్ కి సంతోషంగా పంపిస్తారు.. ఆ తరువాతే ఆ పాటలని విడుదల చేసుకుంటారు.... మీ మీదొట్టు.
"శ్రీమంతుడు" సినిమా "రామ రామ" పాట గురించి వచ్చిన విమర్శలు నవ్వు తెప్పిస్తున్నాయి. మత పిచ్చి అని మరొకటని ఏమిటేమిటో ప్రేలాపనలు. రామజోగయ్యశాస్త్రి ఏం రాస్తారో ఆయనకే తెలియదు అనేది ప్రధానంగా ప్రస్తావించారు. నిజమే మరి... "పచ్చి గడ్డి - ఎండు గడ్డి" అని సాటి "మేధావులతో" నవ్వేసుకుని - "సంస్కృతి - సాహిత్యం" వేరు వేరు అనగలిగే మీలాంటి మహామెధావుల బ్యాచ్ అస్సలు కానే కాదు... ఐ.ఐ.టి చదువులు చదివి ఐదంకెల జీతాన్ని కూడా వదిలేసుకుని పాటే శ్వాసగా బ్రతుకుతూ కళామతల్లి సేవ చేసుకుంటూ ఉండే సాధారణ జీవి .. మీ అంత గొప్పోడైతే కాదు... ఇది గ్యారెంటీ...!!
ప్రతి పులిహోర గాడూ ఈమధ్య కవులని, ముఖ్యంగా సినీ కవులని విమర్శించే వాడే... కర్మ...!! పైగా , మాట్లాడితే ప్రతీ దానికి మతం రంగు పులమడం ఒకటి...మరో వంద జన్మలున్నయేమో అనే నమ్మకంతో ఉన్నారేమో ...అయ్యా సాములూ... ఏం చేసినా ఈ ఒక్క జన్మే... బాగుపడే ప్రయత్నం చేద్దాం కాస్త...!!
* విమర్శ అనేది విశ్లేషణాత్మకంగా - నిర్మాణాత్మకంగా ఉన్నంత వరకూ ఎవరైనా ఆహ్వానిస్తారు. వ్యక్తిగత దుగ్ధతో విషాన్ని చిమ్మడమే విమర్శైపోదు అని గమనించాలి. మీమాటలు మీరెన్నైనా చెప్పుకోండి... కాకపోతే లోతుగా పరిశీలించి, పరిశోధించి.. విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పుడే మాత్రమే మీ సో కాల్డ్ "మేధస్సుకి" పని పెట్టండి కానీ, మిడిమిడి జ్ఞానంతో ముందు వెనక చూసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే అనవసరంగా ఇలాగే అభాసుపాలవుతారు... మీమాటకి ఇది మామాట...!!జై హింద్...!!