Sunday, July 20, 2014

ఇప్పుడూ అంతే...!!

నీకో దారి ఉంది
నాకో దారి ఉంది
ఒంటరితనాన్ని వదిలించుకోవడానికి కాదు,
ఒంటరిగా నడవడానికి...

ఓపిక ఉన్నంత వరకూ
ఒక్కటిగానే కనిపించే ఇద్దరి దారులూ
నమ్మకం సడలిన క్షణంలో
రెండుగా చీలిపోతాయి

గతాన్ని మోసుకుంటూ నేను
భవిష్యత్తుని వెతుక్కుంటూ నువ్వు
ఎటు తీసుకెళ్తుందో తెలియని దారుల్లో
ఏకాకిలా మరో గమ్యానికై సాగిపోతాం...

ప్రపంచం ఎప్పటికీ వెన్నంటే
ఉన్నట్టు అనిపిస్తుంది....
వెనుదిరిగి చూస్తే అంతా శూన్యమే

అయినా,
కారణాలు లేకుండా కలిసే మనసులు
కారణాలు లేకుండా విడిపోవడంలో
పెద్ద వింతేముంది?

మొద్డుబారిన నా గుండెపై
నువ్వు కొట్టింది మొదటి దెబ్బ కాదని తెలుసు
సంద్రాలనే నింపుకున్న నా కళ్ళకిది
చివరి ఏడుపు కాదనీ తెలుసు

గాయం అలాగే ఉంటుంది
నొప్పి లాగే ఉంటుంది...
నువ్వు అలాగే ఉంటావు
నీ జ్ఞాపకమూ అలాగే ఉంటుంది..

ఏకాకితనంలో ఎన్నో ఏళ్లు
కొట్టుకెళ్లిపోయాయి...
"ఆశల" తీరాలకి...
ఇప్పుడూ అంతే...!!

-శతఘ్ని...!! 

Thursday, July 10, 2014

ఊరించే ఓ కలా..కరిగిపోకలా ..!!

సంతోషం అనే పదానికి
అంగుళమైనా చోటు లేనంతగా
నా గుండెల్లో నిండిన బాధంతా...
నీ కళ్ళల్లోకి చూస్తే, ఏమైపోతుందో తెలియదు....

తూట్లు పడేట్టుగా నా చెవుల్లో..
హాహాకారాలు చేసే నిశ్శబ్దపు గర్వమంతా,
నీ కమ్మని కంఠస్వరం వినగానే...
ఏమైపోతుందో తెలియదు....

నన్ను నేను తెలుసుకునే క్రమంలో,
నే కొనసాగిస్తున్న ఈ గతిలేని ప్రయాణం,
నువు పరిచయం కాకపోయి ఉంటే,
ఎక్కడాగిపోయేదో తెలియదు....

ఎప్పటిలాగే...అందరిలాగే
అందీ అందనంతగా ఊరించే...
ఎండమావిలాగ రేపు నువు మాయ చేసిపోతే...
చివరికి ఏమైపోతానో...అస్సలు తెలియదు...!

Random thoughts

కౌగిలి అంటే?
గాలికి కూడా చోటివ్వని ఇరు దేహాల గాఢత ..

ముద్దు అంటే?
చలించే దేహానికో ప్రేరణ ..

కామం అంటే?
కాల్చే తహతహల తాత్పర్యం ...

ప్రేమ అంటే??
మనసుకో నిర్వచనాన్నిచ్చే ప్రాపంచిక భాష ..


అమాయకత్వం అంటే ఏంట్రా?
- నువ్వు మోసపోయిన సంగతిని ఎప్పటికీ నువు తెలుసుకోలేకపోవడం..

మరి తెలివితేటలు అంటే?
- నువ్వు తెలివుతక్కువ వాడివి కావు అని, అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉండటం .. 

కష్టం అంటే?
- నీకు మాత్రమే ఉందనుకునేది ..

తప్పు అంటే ఏంటి మరి?
- నీ ఒక్కడికే ఒప్పు అనిపించేది ..

సమాజం అంటే? 
- నిత్యం నిన్ను కనిపెట్టుకుని ఉండే ఒక నిఘా వ్యవస్థ ..

ఓటమి అంటే??
- బేషరతుగా నీ భుజాలపైన వేసుకోలేని ఒక బాధ్యత .. 

గెలుపు అంటే??
- తరువాత ఏమీ లేదు అని ఒక భ్రమని కల్పించేది .

గమ్యం అంటే??
మరో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకునే చోటు ..

Wednesday, July 9, 2014

మారని " మన "సులు ....!!


నిశ్శబ్దాన్ని చీల్చే ప్రశ్ననై నేను
నిశ్శబ్దాన్ని మిగిల్చే జవాబువై నువ్వు
తలపుల చప్పుళ్ళలో కొట్టుకెళ్తున్నామని తెలుసా??

ముడివేయలేని ఇరువురి ఊపిరి కొనలు
తలో దిక్కుని ఎంచుకుని అనాధలుగా మిగిలిపోతే
వాటిని తలదాచుకోనివ్వని తప్పు
వేరుపడ్డ మన తనువులదే అని నీకు తెలుసా??

అనుమానాలు - అపనమ్మకాలుగా
విభజించబడ్డ మన జీవితాల్లో
ఇద్దరినీ ఒకరినుండి ఒకరిని దూరంగా
చెరోసగం చెదరగొట్టిందని తెలుసా??

కనురెప్పలకిందే కడతేరిపోయి
చేదెక్కే కలల్లోని తీపి
నిజజీవితంలో నింపుకునే ఆశ
మనిషిలో చావదెప్పటికీ ...

ప్రేమకే కనుక అల్లిక సరిగ్గా తెలిసుంటే,
విడాకులు పొందిన మనసుల్ని
విడివిడిగా మరో రాతి గుండెకి పెట్టి కుట్టదెప్పటికీ ...

మనం చేయగలిగిందేముందిలే
తలగడని తడుపుతూ నువ్వు
గాయాన్ని తడుముతూ నేను ...

జారుకుందాం
జాలి చూపలేని మృత్యు ఒడిలోకి ...

-శతఘ్ని ...!!

Tuesday, July 8, 2014

బ్రతుకంతా బలపరీక్షలే...!!

ఊపిరి పోసే ఊహలే
కమ్మని కలలై కళ్ళల్లో మెరుస్తాయి ...

ఉరితీయబడ్డ ఊహల ఆక్రందనలే
ఉబికి వచ్చే కన్నీరై ఉసూరుమనిపిస్తాయి ..

బ్రతుకంతా బల పరీక్షలే 
పొందడానికి- పోగొట్టుకోకుండా ఉండటానికి మధ్య

గిర్రున తిరిగే కాలమెపుడూ నిన్ను
గిరాటు వేస్తూనే ఉంటుంది
గాయాల గతంలోకి
జ్ఞాపకాల కొలిమిలోకి .

కానీ ,
వేలు పట్టుకుని నడపడానికి
ఒక వెలుగు రేఖ ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది

నీ కళ్ళకి ఉన్న చీ "కట్లని "
విప్పడానికి నువ్వు సిద్ధమేనా మరి?

-శతఘ్ని ....!!

Monday, July 7, 2014

వస్తావా సూరీడు మా ఇంటికి??



వీధి దీపాల పెక్కిరింతల మధ్యన
చీకటిని చుట్టూ చుట్టుకుని
బయలుదేరా....
వెలుగు రేఖలని తెచ్చి
వాటి పీచమణుచుదామని....!!

అరకొరగా 
అవి పారించే
అవసరం తీర్చలేని అంతంతమాత్రపు
రంగుల వెలుగులకే
వాటికి అంత మిడిసిపాటు అయితే,

నిశి రాకాసి
రెక్కలు కోసి....
నిర్దాక్షిణ్యంగా నిన్నల్లోకి తోసి
చిక్కటి అడవుల్లోకీ
చక్కగా చొచ్చుకుపోయే..
భానుడికి ఇంకెంత గర్వముండాలి?

వెలుగు పక్షాన నిలిచే
వెర్రిబాగులవాడిలా వాటికి నే,
కనిపిస్తున్నా కాబోలు...
నాదే వెలుగు,
నాతోనే నీ చీకటి తొలగు
అంటోంది... అనుకుంటోంది
రేపో మాపో అనేలా ఉన్న
తిన్నగాలేని తుప్పట్టిన వీధిలోని
మసక స్తంభం..అదే, వెలుగు స్తంభం..!!

ఏంటో,
దారి చూపడం అంత తేలికైనట్టు..!!

సరిగ్గా కిందే నిలుచున్నా,
కనీసం నా నీడ కూడా కనిపించదు...
అని ఊరి వారెందరికో
వాటిమీద షికాయత్తులు...!!

అంత బాగా వెలిగే
ఆ వీధి దీపం తాలూకు అక్కసు
నాకు తెలుసు....

కొక్కోరొక్కో కూతలు వినపడగానే
ఊరు ఊరంతా
ఇంటికొచ్చే ఎవరో అతిధి కోసం
ఎదురుచూస్తున్నట్టు.....
వెచ్చదనపు స్పర్శలని పంచే
సూర్యదేవుని కోసం...
కాయలు కాయించి...పండిస్తారు...
కళ్ళకి....!!

వారిలో ఒక్కడినైన నేను
అందుకే బయలుదేరా....
తూరుపింటి తలుపులు తెరుచుకోకముందే,
నే వెళ్ళి తీసుకురావాలని తనని...!!
పశ్చిమపు పొదరింటికి వెళ్ళేదాకా,
మధ్య దారి ప్రయాణం కాస్త ఎక్కువేగా...

వీలు కుదిరితే
ఓ సారి మా ""కంటి"కొచ్చి పోతాడేమో అని ఆశ....!!

అవును...నేనో గుడ్డివాడిని....!!

-శతఘ్ని...!!

Saturday, July 5, 2014

"మిధ్య" తరగతి...


భోజనాల వేళ భర్త మోముపై
భార్య చేతిలోని విసనకర్ర బలంగా వీస్తోంది...
ఒకటో తారీఖనేమో?
అయ్యవారి జేబులోనున్న
జీతం కట్టలోని నోట్లకి మించి
కుటుంబ సభ్యుల కోరికల చిట్టా ఉంది...

లెక్కలు ఇంత క్లిష్టంగా ఉంటాయా అని
ఆ కోరికలని తీర్చే క్రమంలో
అయ్యే ఖర్చుని బేరీజు వేసుకున్నప్పుడు
మగాడి మదిలో ఒక ఆలోచన మొలుస్తుంది...

సముద్రంలో నిమజ్జనం చేయడం సులువు కానీ,
ఈదడం అంత సులువు కాదని
మాంగళ్యం తంతునానేనా మత్రాలు విన్నప్పుడు
పాపం అతగాడికేం తెలుసు....
నిజానికి తెలియనిస్తుందా వయసు??

పెన్నులోని ఇంకు ఇంకిపోయినా
నెల వారీ ఖర్చుల లెక్కలు
అంత తొందరగా తెమిలేనా?
మధ్య తరగతి మహాభారతం ఇది....
అవసరం అనే కృష్ణుడు...
మధ్యతరగతి నిస్సహాయత అనే అర్జునుడికి చెప్పే
గీత ఆ గాధ....!!
ఆగేది కాదు కదా...?
అంతులేని ఆ వ్యధ..!!

అరువిచ్చినవాడే ఆప్తుడు
అప్పడగనివాడే బంధువు
ప్రతి మధ్య తరగతి మనిషికి...
సంపాదనని పెంచుకోలేని...
ఖర్చులని తగ్గించుకోలేని...
మధ్యతరగతి మొగుళ్ళు...
భార్యల మనసుల్లోని ఆశలకి పగుళ్లు...!!
పిల్లలకి చీకటి నిండిన పగళ్ళు...!!

పాపం..."మధ్య" తరగతి..!!.
పేరుకి తగ్గట్టే,
ఆశకి..నిరాశకీ "మధ్యన"
నలిగిపోతుంది ఈ "మధ్య" తరగతి....
ఎవరికీ పట్టని,
మరో తరగతి మెట్టెక్కని
"మిధ్య" తరగతి...!!

-శతఘ్ని...!!

ఆమె లేని రాత్రి....!!



చిక్కబడ్డ చీకటి
నా గుండెని చీల్చుతోంది...
నిశ్శబ్దం నా నరనరాల్లో
నిండిపోతోంది....

మరుమల్లెలు నా బాధ చూడలేక
గుప్పుమనాలో లేదో అని
మల్లగుల్లాలు పడుతున్నాయి...

వెన్నెల చల్లదనం
నాకేమాత్రం ఆనడంలేదు...
నిద్రాదేవి సైతం నన్ను
పూనడంలేదు.....

విడివిడిగా ఉండటం వల్లే
ఇరువురి చెంత విరహం
విచ్చుకుంటుంది అంటే,
నిమిషమైనా నిన్నొదిలి ఉండక పోయేవాడినేగా....

పగలు పనిలో పోతోంది కనుక పరవాలేదు..
రేయినెలా గడపడం?
నీ పెదవుల గురుతులు లేక....
నా గుండెవాకిలి బోసిపోయింది....

నిశి నిద్దుర లేవకముందే
పశ్చిమపు పిశాచి గొంతులోకి జారే
భానుడిని ఎలాగయినా పట్టి ఆపేయాలని ఉంది...

ఎందుకంటే,
మసక తెరల మాటున ఉండి
దాడి చేసే కాముడిని,
కొక్కోరొక్కో కూతల దాకా
ఒంటరిగా కట్టడి చేయడం
ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది...!

-శతఘ్ని...!!

Friday, July 4, 2014

ఏమిటో ఈ తప్పొప్పులు..!!

మొట్టమొదటి తప్పు చేసినప్పుడు
అది తప్పు అని అప్పుడు తెలియలేదు...

రెండవసారి మరో తప్పు చేసినప్పుడు
అలా చేయడం తప్పు అని తెలియలేదు...

కానీ,స్పష్టతలేని ఈ సమాజం
ఇప్పుడు నేనేం చేసినా తప్పే అంటోంది...
అది తప్పే అని నేను ఒప్పుకున్నా... ఒప్పుకోకపోయినా...!!
ఇంతకీ అది నా తప్పా.... సమాజం తప్పా?

ఇంతకీ తప్పు అంటే...
తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదా?
తప్పక చేసేదా?
ఒప్పే 'అనుకుని' చేసేదా??

తప్పొప్పులని నిర్ణయించేది ఎవరు ఇంతకీ?
నాలోని సమాజమా?
సమాజంలోని నేనా?
మంది చెప్పేది మనసుకి నచ్చదు
మనం చేసేది మనుషులకి నచ్చదు...

ఒక్కడు పదిమందికి చెప్తే
ఒక్కడికీ నచ్చదు...
పదిమంది ఒక్కడికీ చెప్తే
ఒక్కడికీ నచ్చదు....
నచ్చని పని ఒప్పని ఒప్పుకుంటే
తప్పు కాదా?
నచ్చని పని తప్పని తప్పుకుంటే మాత్రం
తప్పవుతుందా....?

అసలేమిటీ తప్పు ఒప్పులు?
అర్ధంలేని తిప్పలు....!!

-శతఘ్ని....!!

నువ్వు చేసింది మానే గాయం కాదు...!

నన్ను నీలో చూసుకుని
నమ్మకంగా అడుగేశా..
నీ మనసుతో పెనవేసుకుని
నన్ను నీకు వదిలేశా.....
ఆశలెన్నో రేపావే...నా శ్వాసే నువ్వంటూ..
బాసలెన్నో చేశావే...ఈ జన్మే నీదంటూ....

కడదాక వీడనని..కనుమరుగై పోను అని
నువ్విచ్చిన మాట నా బ్రతుకున 
తీపి నింపుతుందనుకున్నా.....
శూన్యాన్ని నింపిందని తెలుసుకుని
నీరసించి నిలుచున్నా......

తడి ఆరాక... కనుమూద్దామనుకుంటే,
మదిలో నీ తలపుల సడి ఆగదే.....
మరమనిషిలా సాగిస్తున్న 
ఈ ప్రయాణం ముగిద్దామనుకుంటే,
మరుజన్మలోనైనా నువ్ జతపడగలవని
మనసు ఏ మాత్రం నమ్మదే?

అంటే...
నువ్ చేసిన గాయం తీవ్రత తెలుస్తోందా?

-శతఘ్ని..!! 

మనకేం తక్కువ...?



తొలిసారిగా నాకు కోపం
పరిచయమైన రోజులవి..
ఆరేళ్ళ వయసులో నా బలపాన్ని
ఎవడో నా చేతుల్లోంచి లాగేసుకున్నాడు..
నాకొచ్చిన దాన్ని కోపమంటారని కూడా
తెలియని వయసది....
కోపమొచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో
ఏమో నాకప్పుడు తెలియదు...
టీచరుకి చెప్తే...
చాక్లెట్టు చేతిలో పెట్టి
నా ఏడుపుని ఆపింది....

తొలిసారిగా నాకు అసూయ
పరిచయమైన రోజులవి...
పన్నెండేళ్ళ వయసులో..
నాకంటే బాగ చదువుతున్నవాడిమీద
ఏదో తెలియని ఉక్రోషం...
అప్పుడు నాకు తెలియని ఆ భావనని
అసూయ అంటారని నాకు తెలియని వయసది...
ఒక వ్యక్తి మీద అసూయ కలిగినప్పుడు
ఏం చేయాలి అన్న విషయం పట్ల ఏమాత్రం
అవగాహన నాకప్పుడు లేదు...
ఇంట్లో చెప్తే....
బాగ చదవాలి మరి అని చెప్పి,
పెద్దలు ఉపదేశించడంతో.. నా మనసు
అంతే కాబోలు అని సరిపెట్టుకుంది...

తొలిసారిగా నాకు ద్వేషం పరిచయమైన రోజులవి..
పద్దెనిమిదేళ్ళ వయసులో..
నాతో పాటే తిరిగిన నేస్తాలందరూ...
నాకంటే డబ్బులెక్కువున్నోడి స్నేహితులుగా
రాత్రికి రాత్రే మారిపొయినప్పుడు..
నా అనుకునే నా నేస్తాలను
నాకు కాకుండా చేసిన వాడంటే...
విపరీతమైన ద్వేషం పెరిగిన పరిస్థితి...
ఒక మనిషిని అంతగా ద్వేషించేటప్పుడు..
నేనెలా ఉండాలో ... ఏం చేయాలో
తెలియని ఆ సందిగ్ధావస్థలో...
వదిలెయ్ రా ... అని మిగతా స్నేహితులు
చెప్పినప్పుడు.. కష్టంగా తలూపా..

తొలిసారిగా ప్రేమ పరిచయమైన రోజులవి...
చూడగానే మనసుకి హత్తుకుపోయిన
ఆమె అందానికి నేను దాసోహం అన్న పరిస్థితి..
పాతికేళ్ళ వయసులో... తొలిప్రేమ తాలూకు
మధురానుభూతులని.. ఆస్వాదిస్తున్న నాకు..
శరాఘాతం ..
నాకంటే అన్ని రకాలుగా
మరో మనిషి తన కళ్ళకి ఉన్నతంగా కనిపించాడట..
వాడికున్న అర్హతలు...
నాకంటే ఎక్కువ ఆస్తిపాస్తులు..
నాకంటే ఎక్కువ చదువు..
నాకంటే ఎక్కువ అందం...
నీకొసం వాడు అవన్నీ వదులుకోలేడు..
కానీ.. నేను నీకోసం నా ప్రాణాన్నైనా
వదిలేసుకుంటా అన్న నా మాటలు
తన మనసులో చలనాన్ని తేలేకపోయాయి..
ప్రేమున్నచోట సర్దుబాట్లుంటాయి..
అదిలేనిచోట.. రాజీలే ఉంటాయి అంటే..
ఆ పిచ్చి మనసుకి అర్ధం కాలేదు..
పోనీలే అని వదిలేసుకున్నా...

మనిషి జీవితంలో...
ఇన్ని లెక్కలుంటాయా?
లెక్కల పుస్తకాల్లోని
చిక్కు ప్రశ్నలు నాకు చాలా
చిన్నవిగా కనపడసాగాయి...

ఎన్ని దెబ్బలు తగిలినా
నా ప్రయాణం ఆగలేదు...
ఎవరికోసమూ.. ఎవరి జీవితమూ ఆగదు..
అని తర్వాత అర్ధమైంది.....
...
నాకు పరిచయమైన నేస్తాలన్నీ
నాకు ఏదో ఒక పాఠం నేర్పించినవే..
కానీ ఒక్కటి మాత్రం నిజం...
అక్క్కర్లేదు అనుకోవడంలో ఉన్న ఆత్మ సంతృప్తి
మరి ఎందులోనూ ఉండదు....
మనకేం తక్కువ అనుకోవడంలోని మజా కూడా
ఇంకెక్కడా ఉండదు....

-శతఘ్ని...

Thursday, July 3, 2014

అంతా నీ ఇష్టం....!!


నేనొక అసంపూర్ణంగా మిగిలిపోయిన వాక్యాన్ని..!!
పూర్తి చేస్తావో...పూర్తిగా తుడిచేస్తావో నీ ఇష్టం..!!

నేనొక అస్పష్టంగా వ్యక్తబరచబడ్డ భావాన్ని..
అర్ధాన్ని అద్దుతావో...నీ అసహ్యాన్ని రుద్దుతావో నీ ఇష్టం...

నేనొక అయోమయంతో అడుగులేస్తూ అర్ధాంతరంగా ఆగిపోయిన పాదాన్ని.. 
నమ్మకాన్నిచ్చి నడిపిస్తావో...నడి సంద్రంలో వదిలేస్తావో నీ ఇష్టం...

నిన్ను పొందలేని నిస్సహాయత నిండిన బలహీనతని..
జతై నన్ను బలపరుస్తావో.. దూరమై మరింత బలహీనపరుస్తావో నీ ఇష్టం..

ప్రపంచానికి దూరంగా విసిరివేయబడ్డ భారాన్ని...
నీక్కూడా బరువనుకుంటావో.. నేను నీ బాధ్యతనుకుంటావో నీ ఇష్టం..

సమాజం దృష్టిలో నేనొక నిత్యం జరిగే పొరపాటుని..
ప్రేమగా సరిదిద్దుతావో... తప్పునయ్యేదాకా ఎదురుచూస్తావో నీ ఇష్టం...

అస్పష్టమైన ముగింపుని...
అర్ధంలేని తెగింపుని

అర్ధరహిత భావాల మధింపుని
నెరవేరని ఆశల కుదింపుని...

కొత్త బ్రతుకునిస్తావో... ఇలాగే బ్రతకనిస్తావో
నీ ఇష్టం.... అంతా నీ ఇష్టం...!!

-శతఘ్ని....!!