Wednesday, May 20, 2015

అందమైన ''వ్రాత'" కి అరవయ్యేళ్ళు ..!!

ప్రతీ మనిషి జీవితం ఏదో ఒక దశలో "అంతకుముందు - ఆతరువాత" గా విభజించి చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ విభజనకి కారణం ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి లేదా మరేదైనా అయి ఉండవచ్చు. నా విషయంలో మటుకు ఒక వ్యక్తి... కాదు కాదు ఒక శక్తి కారణం. ఆ శక్తి పేరు ''సిరివెన్నెల" సీతారామశాస్త్రి. ఆయన పరిచయానికి ముందు, ఆ తరువాత నా జీవితం ఎలా ఉందో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నిస్సందేహంగా , నా జీవితంలో తప్పుకి-ఒప్పుకి, న్యాయానికి-అన్యాయానికి, ఆవేశానికి-ఆలోచనకి, మంచికి-చెడుకి మధ్యన ఆయనే విభజనరేఖ అని చెప్పగలను. సిరివెన్నెల గారి పరిచయం నా జీవితంలో అతిపెద్ద మలుపు... ఆయనతో సాన్నిహిత్యం ఇప్పటివరకు (వ్యక్తిగతంగా మరెప్పటికీ)నేను  అందుకున్న అతిపెద్ద గెలుపు. 

1997 లో పదహారేళ్ల ప్రాయంలో వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుండి పదవ తరగతి అయ్యాక హైదరాబాదులో అడుగుపెట్టి కొత్త ప్రపంచంతో కొత్తగా పరిచయం పెంచుకుంటున్న రోజులవి. అప్పటివరకు నలుపు-తెలుపు కె  అలవాటుపడ్డ నా కళ్ళకి నగరం నాకు సప్తవర్ణాలతో స్వాగతం పలుకుతున్న ఇంద్రధనుస్సులా  కనిపించింది. నగరానికి రావడం అదే కొత్త కానప్పటికీ, వేసవి సెలవుల్లో వచ్చివెళ్లినట్టు కాకుండా ఇకమీదట  ఇక్కడే ఉండబోతున్నా అనే భావన వల్ల బహుశా అలా అనిపించి ఉండవచ్చు.  

రెక్కలు  విచ్చుకుంటున్న కొత్త ఊపులో ప్రతీ పక్షి పిల్లకీ ఇకమీదట ఆకాశం అంతా తన సొంతమే అనే భావన కలుగుతుంది. నాకూ అలాగే అనిపించింది. ఒక్కసారిగా దొరికిన  స్వేచ్ఛకి, పొంగే వయసు - తుళ్ళిపడే మనసు నన్ను నా ఆధీనంలో లేకుండా చేయసాగాయి. నన్ను నేను కొత్తగా చూకోవడం మొదలుపెట్టిన ఆ దశలో ,  అజ్ఞానం- అమాయకత్వంతో  నేను చేసిన కొన్ని ఘోరమైన తప్పిదాలు(అది తప్పా ఒప్పా అని కూడా తెలుసుకోలేని ఒక మూర్ఖపు మానసిక స్థితి)  , ఒక దిశ అంటూ లేకుండా నేను చేసిన ప్రయాణం, కోపం-ఆవేశం-మోహం, మొండితనం- నిర్లక్ష్యం , దుడుకుతనం , పొగరు వల్ల నేను ఎదుర్కొన్న అనుభవాలు , దానివల్ల నేను పడ్డ మానసిక సంఘర్షణ వర్ణనాతీతం. 

ఏం చేసినా తప్పు అనేవారే కానీ, ఏది ఒప్పో చెప్పేవారు లేకపోవడం, ఎటు అడుగు వేసినా .అది మంచిదారి కాదు అనేవారే కానీ - ఎటు వెళ్తే మంచిది అని దారిచూపే వారు లేకపోవడం , పైలట్ అవ్వాలని ఎంత ఆశపడ్డా , తగినంత ఆర్ధిక స్తోమత లేక ఆ కోరికని  అణచుకోవాల్సిరావడం, ఇంట్లో తెలియకుండా బిఎస్ఎఫ్(బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) కి అప్ప్లై చేసి - కష్టపడి ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేసి కాల్ లెటర్ కోసం ఎదురుచూస్తుంటే ...  కాలేజీకి  వెళ్ళొచ్చేలోపు నాకు వచ్చిన  ఆ కాల్ లెటర్ ని ఇంట్లో చించివేయడం , ఇంటికి పెద్దకొడుకువి అలా సైన్యంలోకి పోతే ఎలా అంటూ గొడవ చేయడం.. నా .మనసుని కలచివేసాయి. . ఇక ఈ బ్రతుకు వ్యర్ధం అని చావడానికి సిద్ధపడి ఇంటి నుండి చెప్పా పెట్టకుండా ఏదో పని ఉన్నట్టు బయటకి వెళ్ళిపోయా..  కానీ ఆత్మహత్య ఎలా చేసుకోవాలి... ఎక్కడ చేసుకోవాలి అనే ప్రశ్నలు మనసుని తొలచివేయడం వల్ల ఏమీ తోచని స్థితిలో రోడ్డు  మీద  పిచ్చివాడిలాఅలా ఎండలో దాదాపు మూడుగంటలు తిరిగి తిరిగి నీరసం వచ్చి,  నీడ కోసం పక్కనే ఉన్న ఒక ఇరానీ హోటల్ లోకి వెళ్ళి కూర్చున్న. టీ తాగడానికి, బన్ను కొనుక్కుని తినడానికి కూడా సరిపడా చిల్లర లేదు జేబులో.. బ్రతకడానికి అత్యంత  అవసరమైన గాలిని ఇంతమంది ప్రపంచంలో ఉచితంగా పీల్చుతున్నారు... కానీ.. దాహం  తీర్చుకోవడానికి నీళ్ళని... ఆకలి తీర్చుకోవడానికి ఆహారాన్ని మాత్రం కొనుక్కోవాల్సి వస్తుందేమిటి? అనే ఆలోచనలు ఎందుకో టక్కున మనసులో మెదిలాయి. 

ఆ ఆలోచనల ఫలితంగా మొదటి సారి ఏదో వ్రాయాలీ అని మనసుకి అనిపించింది సమయానికి పెన్ను - పేపరు లేదు మరెలా అని అటూ ఇటూ చూస్తుండగా... హోటల్ లోని కౌంటర్ టేబుల్ పక్కన దాదాపు అయిపోయిన ఒక రీఫిల్ పడి ఉండటం కనిపించింది. అది తీసుకుని అరచేతి మీద గీస్తే పడింది... కానీ కాగితం ముక్క దొరకలేదు. అంతలో నా ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చున్నాయన చొక్కా జేబులోంచి డబ్బులు తీస్తుంటే బస్సు టికెట్ ఒకటి కింద పడింది. ఆయన లేచి వెళ్ళిపోయాక ఆ టికెట్ తీసుకుని దాని వెనకాల "కన్నీళ్ళు ఎలాగూ ఉచితమే కదాని, కష్టాలు  ఇన్నేసి వస్తాయేమో మనుషులకి" అని అర్ధం వచ్చేలా ఏదో వ్రాసుకున్నా. వెంటనే కాస్త రిలీఫ్ అనిపించింది. మనసులో అలజడిగా ఉన్నప్పుడు పేపరు మీద ఆ అలజడిని పరిస్తే ఇంత ఉపశమనం లభిస్తుందా అనిపించింది. బహుశా అప్పుడే నాలోని కవి(అనబడేవాడు లేదా అని భ్రమపడేవాడు) నాకు తెలియకుండా నిద్రలేచాడేమో...!!

కట్ చేస్తే, ఆ హోటల్ నుండి బయటకి రాగానే రోడ్డుకి అవతల ఒక ముసలాయన కింద టవల్ పరిచి వాటి మీద చిన్న చిన్న పుస్తకాలు ఏవో పెట్టుకుని అమ్ముతున్నాడు. ఏమిటా అని దగ్గరకి వెళ్ళి చూస్తే సినిమా పాటల పుస్తకాలు. ఒక్కోటి రెండు రూపాయలు. జేబులో  సరిగ్గా మూడు రూపాయల యాభై పైసలు మాత్రమే ఉన్నాయి. సరే ముందు ఒక పుస్తకం  చదువుదాము అని 'సిరివెన్నెల' పుస్తకం కొన్నాను. పక్కనే చెట్టుకు ఆనుకుని నిలబడి పుస్తకాన్ని  ఆపాదమస్తకం బట్టీ పట్టేసాను... అంతలా ఆకట్టుకుంది ఆ సాహిత్యం. ఒకేసారి ఆశ్చర్యం- ఆనందం... ఏమిటీ తెలుగు... నేను రోజూ మాట్లాడుకునే ఈ భాషలో ఇంత తీపి ఉందా... ఇంత అందంగా కూడా తెలుగు ని వ్రాయవచ్చా? మన భావాలకి ఇంత అందమైన అక్షరాలని అద్దొచ్చా అనిపించింది. పుస్తకం తిప్పి చూస్తే  సంగీతం: కేవీ. మహదేవన్ సాహిత్యం : సీతారామశాస్త్రి , దర్శకత్వం: కె. విశ్వనాధ్ అని ఉంది.  మిగతా ఇద్దరి పేర్ల కంటే సీతారామశాస్త్రి అనే పేరు నా బుర్రలోకి బలంగా చొచ్చుకుపోయింది. 

అలా నిలుచోవడం .. కదలకుండా పుస్తకాన్ని చదవడం చూసి ఏమనుకున్నాడో ఆ ముసలాయన కానీ, సీతారామశాస్త్రి రాసిన పాటల పుస్తకాలు ఇంకొన్ని ఆ కొన్ని ఇమ్మంటావా? అని అడిగాడు. నేను అవును అన్నట్టు తలూపగానే స్వయంకృషి, శృతిలయలు, ఆపద్భాంధవుడు, ఇలా కొన్ని పుస్తకాలు నా చేతిలో పెట్టాడు. తాతా".. డబ్బులూ...." అంటుండగానే మధ్యలో ఆపి "రేపు తెచ్చిద్దువులే...." అన్నాడు. ఒక వ్యక్తి పట్ల కృతజ్ఞతాభావంతో నా కళ్ళు చెమర్చడం అదే మొదటిసారి. ఈ గోలలో పడి అసలు నేను బయటకి ఎందుకొచ్చిన సంగతి మరచిపోయాను. ఇంట్లో ఆ పుస్తకాలు చూస్తే ఏమంటారో అని మడిచి జేబుల్లో కుక్కుకుని మెల్లగా ఇంటికి వెళ్ళాను. చస్తా అని బెదిరించి వచ్చి ఉంటే బహుశా, అందరూ బెంగ తో ఘనంగా స్వాగతం పలికేవారేమో... ఏదో ఆడుకోవడానికి వెళ్తున్నట్టు బయటకి వచ్చా కదా, అలాంటి స్వాగతాలు ఏమీ లేవు... వెళ్ళగానే మళ్లీ ఏదో విషయంలో తిట్లు.. చీవాట్లు... అనుకోకుండానే , అనవసరంగా మాటలు పడటానికి అప్పటినుంచే అలవాటుపడ్డాను(ఇంట్లో మాత్రమే).

మరునాడు కాలేజీ కి వెళ్లే దారిలో కనిపించిన ఆ ముసలాయనకి ముందు రోజు తీసుకున్న పుస్తకాల డబ్బులు ఇచ్చేసి, మరికొన్ని పుస్తకాలు తీసుకుని బయలుదేరా. ఇక అప్పటినుంచి అలా మూడు నెలల పాటు సీతారామశాస్త్రి అనే పేరు కనిపించిన ఏ పుస్తకమూ వదలకుండా చదివేశా. అప్పటి నుంచి ఆ వ్యక్తిని ఎలాగైనా ఒకసారి కలవాలి... మాట్లాడాలి అని అనుకుంటూ ఉండేవాడిని. ఇదంతా 1999 లో జరిగింది. నా ఇంటర్ అయిపోవస్తున్న దశ. ఆ తరువాత డిగ్రీలోకి రావడం... మెల్లమెల్లగా నేను కూడా ఏదో ఒకటి వ్రాస్తూ ఉండటం జరుగుతూంది. ఇక అప్పటి నుండి పాటల పుస్తకాల బదులు ఆడియో క్యాసెట్లు వచ్చి చేరాయి. వారానికోసారి క్యాసెట్తు షాపుకి వెళ్ళడం, కొత్తగా విడుదల అయిన క్యాసెట్లు అన్నీ చూడటం.... దేని మీద సీతారామశాస్త్రి పేరు కనపడితే అది కొనుక్కొచ్చేయడం... డబ్బులు లేని ఒకటి రెండు సార్లు కొట్టుకొచ్చేయడం చేసేవాడిని. పాకెట్ ఖర్చులకి ఇచ్చే చిల్లరని పోగేసి మాత్రమే కొనేవాదిని. ఇంట్లో అడిగితే, ఎవరో ఫ్రెండ్ ఇచ్చాడు... విని తెచ్చిస్తా అని తీసుకొచ్చా అని చెప్పేవాడిని. అలా మొదలైన ఆ మనిషి పిచ్చి రోజురోజుకీ ముదిరిపోతూ వచ్చింది. 

(సిరివెన్నెల నాపై కురిసిన కథ మరో సందర్భంలో ఎపుడైనా చెబుతాను. )

ఒక్కసారి చూస్తే చాలు అనుకున్న దశ నుండి ఆయన కుటుంబ సభ్యుడిలా ఆయనచేత ఆదరింపబడటం పూర్వజన్మ సుక్రుతమె కానీ మరొకటి కాదు. గురూజీ గుండెలపై వాలితే వచ్చే తృప్తి, ఆయన పాదాల చెంత లభించే ప్రశాంతత మరెక్కడా దొరకదు. నాన్నగారు , బాబాయ్, మేస్టారూ, గురూజీ, గురువుగారు, సార్... ఇలా ఎపుడు ఎలా అనిపిస్తే అలా పిలుస్తూంటా... అన్ని పిలుపులకీ "చెప్పరా నాన్నా" అనే బదులు వస్తుంది. ఇంతలా ఎలా ప్రేమిస్తారు మనుషులని అనిపిస్తుంది ఒక్కోసారి...!! అదీ, సాహిత్య శిఖరం లాంటి మనిషి... ఇంత సాదా సీదాగా... ఇంత నిరాడంబరంగా... ఉఫ్.. అందుకే అంత పిచ్చి... చచ్చేంత పిచ్చి...!! 

నా ఆవేశాన్ని, నా ఆలోచనని, నా అంతర్మథనాన్ని , నా కసిని, నా కోపాన్ని, నా అల్లరిని , నా అలకని, ఆయన అర్ధం చేసుకున్నట్టు, ఆయన  భరించినట్టు మరెవరూ అర్ధం చేసుకోలేరు... మరెవరూ భరించలేరు.... అన్నది నిజం. నేను ఏదో ఒక రోజున గొప్ప రైటర్ ని అవుతా అని దాదాపు పధ్నాలుగేళ్ళ క్రితం చెప్పారు. ఆయన నమ్మకాన్ని ఇప్పటికీ నిజం చేయలేకపోయాను. సరైన అవకాశాల కోసం  ఇంకా పోరాడుతూనే ఉన్నాను. అయినా కానీ, ఇప్పటికీ ఆయనకి నా మీద అదే నమ్మకం... ఆ నమ్మకం మా ఇంట్లోవాళ్లతో సహా ఎవరికి ఉన్నా లేకపోయినా ... ఆయనకి మాత్రం చెక్కు చెదరడం లేదు... ఎందుకో తెలీదు మరి.

ఒకానొక సందర్భంలో "నేనో నిండు సున్నా" అని అంటే... నీ ముందు అంకెనై నేనున్నాగా నాన్నా... అనే ధైర్యాన్ని ఇచ్చేలా మాట్లాడారు. నిజమే... ఆయన లేకపోతే నేను లేను..నాకు విలువ లేదు. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే, నేను వ్రాసే ప్రతీ అక్షరం నాకు ఆయన పెట్టిన భిక్షే..!! నా గొప్పతనం ఏమీ లేదు..!! 

చావాలనే కోరికని చంపేసి... బ్రకాలనే కసిని బలపరిచి ... ప్రత్యక్షంగా... పరోక్షంగా నా నడకకి, నా నడతకి-- నా భావాల ప్రవాహానికి దిశా నిర్దేశం చేస్తూ నన్ను నాలాగే బ్రతికేలా చేసిన నా సర్వస్వం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి.... నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అరవై కాదు గురూజీ... నా ఆయుష్షు కూడా పోసుకుని నూటా అరవై ఏళ్లు ఇలాగే మీ అక్షరాలతో మమ్మల్ని తడిపి ముద్ద చేయాలని.... మీ అద్భుతమైన భావజాలంతో తెలుగు భాషని మరింత ముద్దుచేయాలని కోరుకుంటూ.........

మీ 
అబ్బాయ్...
వినీల్...నామవరపు
అలియాస్
శతఘ్ని...!!





Saturday, May 9, 2015

'పోరి'అనేది తిట్టేమీ కాదే?


రాజకీయ నాయకుల లాగా మనలో మనం ఎప్పటి నుంచి ప్రతీదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాం? ఎప్పటినుంచి మనలో మనం ప్రాంతీయ-భాషా విబేధాలని రెచ్చగొట్టేలా కుమ్ములాడుకుంటున్నాం? జాతీయ, అంతర్జాతీయ సమస్య అయినట్టు ఆఖరుకి ఒక సినిమా విషయంలో కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నాం? ఇక్కడ ఈ ప్రస్తావన తీసుకురావడం ఒక రకంగా అనవసరమె అయినా, మరో రకంగా ఒక విషయం గురించి మనం మాట్లాడుకోక తప్పదు.

ఎంతమంది ఆంధ్రా దర్శకులు తెలంగాణా  మాండలికం ని కించ పరిచేలా, తెలంగాణా ప్రజలని అవమానపరిచేలా హాస్యాస్పదంగా ఎన్ని సినిమాల్లో చిత్రీకరించలేదు? కోడి గుడ్డు మీద ఈకలు పీకడం తెలంగాణా వాళ్ళకి చేతకాకనా? ప్రతీ అయిన దానికి కాని దానికి తెలంగాణా ప్రజలు గొడవ చేయలేకనా? ఒక సినిమాని సినిమాలా చూడటం మనం ఇంకెప్పుడు నేర్చుకుంటాం?

ఒక పక్క "ఆంధ్రాపోరి" చిత్ర దర్శకుడు అంత స్పష్టంగా వివరణ ఇచ్చాక కూడా ఏమిటీ హడావిడి నాకు అర్ధం కాదు. "ఆంధ్రా" అనే పదాన్నే అసలు వాడకూడదా? ఆ పదానికి ఏమైనా పేటెంట్ తీసుకున్నారా ఎవరైనా? తెలంగాణా మాండలికంలో అమ్మాయిని  పోరి అని , అబ్బాయిని పోరడు అని సంబోధించడం సర్వసాధారణం... అదేదో బూతు అయినట్టు, మనోభావాలు... వగైరా అంటూ ఇంతలా ఒకరిని చూసి మరొకరు రెచ్చగొట్టుకోవడం, అమ్మాయిల పేరుతో ఫేస్‌బుక్ లో ఫేక్ అకౌంట్లు కూడా సృష్టించి ఇలా దాడికి దిగడం ఎంతవరకు సమంజసం? "ఆంధ్రాపోరి" కి బదులు " ఆంధ్రా పోరడు" అని పెట్టి ఉంటే ఇంతమంది నోళ్ళు లేచేవా? సినిమా చూసేదాకా కూడా ఆగదా ఎవరికి? సినిమాలో కనుక "ఆంధ్రా" అమ్మాయిలని నిజంగా కించపరిచే విధంగా ఏమైనా సన్నివేశాలుంటే అప్పుడు నిరసన గళం ఎత్తే వాళ్ళలో నేనే ముందుంటాను...!! ఓపిక ఉండాలి కదా దేనికైనా?

కొంతమంది చేసే అతి చూస్తుంటే అసలు ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలో, ఎలా మర్యాదగా ప్రవర్తించాలో తెలంగాణా వాళ్ళకి అసలు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కొన్ని విషయాలు ఎక్కడికి ఆపాలో అక్కడికి ఆపేస్తే అందరికి క్షేమం... అనవసరమైన గొడవలు పెట్టుకుని, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర- తెలంగాణా ప్రజల మధ్యన మిగిలిఉన్న కొద్దిపాటి ప్రేమని కూడా మనమే ఛంపేస్తున్నాం..!!

అటు సాటి మనుషులని గౌరవించుకోలేక, ఇటు భాషని గౌరవించుకోలేక, ప్రాంతాలని గౌరవించుకోలేక ఎందుకు ఇక మనం మనుషులం అని చెప్పుకోవడం? మాట్లాడితే ఒకరి మీద ఒకరం పడి ఏడవటమేనా జీవితమంతా? కలిసి నవ్వుకోలేని పరిస్థితులు, ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకోలేని పరిస్థితులు, ఎక్కడైనా ఎదురుపడితే కుల-మత-ప్రాంతాలకి అతీతంగా .. అవేమీ పట్టించుకోకుండా ప్రేమగా ఒకరినొకరు సోదర భావంతో ఆలింగనం చేసుకోవడం పక్కనపెట్టండి, కనీసం కరచాలనం కూడా చేసుకోలేనంతగా మనం చెడిపోయామా?

కేవలం ఒక సినిమా టైటిల్ విషయంలోనే ఇంతలా విషం చిమ్ముకుంటుంటే, రేప్పొద్దున... సీమ వెంకటేశ్వరసామి దర్శనానికి వెళ్ళి వచ్చాము... ఆంధ్రా దుర్గమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నాము... తెలంగాణా నరసింహస్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం... అని... కూడా మాట్లాడుకునే దౌర్భాగ్యపు స్థితికి చేరుకుంటే ఆ పాపం ఎవరిది? అప్పుడు ఎవరు ఎవరిని నిందించుకుంటారు?

ప్రతీ ఒక్క దానికీ ఇలా ప్రాంతీయ విభేదాలని అంటకడుతూ వెళ్తే, ఒకరికొకరం అంటరానివారమైపోమా కొన్నాళ్ళకి?వందల ఏళ్ల నుండి కులం- మతాల పేరిట జరిగే దాష్టీకాలనే ఇప్పటికీ మాపలేకపోతున్నాం... ఇక ఆ జాబితాలోకి నయం చేయలేని వ్యాధిలా ఈ ప్రాంతీయ విభేదాలు కూడా మారితే మన తెలుగు జాతి ఇక బాగుపడ్డట్టే...!!

ఈ టపా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని నా మీద పీకల  దాకా కోపం వచ్చినా, నా మీద మరోసారి అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చినా వెంటనే నన్ను నిర్మొహమాటంగా "బ్లాక్" చేసుకోవచ్చు... నర్సరీ చదివే పిల్లల్లా ఆలోచించే జనాలకి వివరణలు- సంజాయిషీలు ఇచ్చే ఓపికలు ఎవరికీ లేవిక్కడ...

అర్ధం చేసుకున్న వాళ్ళు ఆలోచించండి.... కాని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి..!! కానీ, ప్రతి దానికి తెలంగాణా ప్రజలని విలన్లుగా చిత్రీకరించే అలవాటుని దయచేసి మార్చుకోండి..!! భౌగోళికంగా ప్రాంతం మాత్రమే విభజించబడ్డది... మనుషులు కాదు, మన ప్రేమలు కాదు... అన్నింటికీ మించి మనలోని మానవత్వం కాదు...!!

ఇది తెలంగాణా వాడి బాధ కాదు.... "తెలుగు వాడి" బాధ....!! ఇక సెలవు..!!

-శతఘ్ని..!! 

Tuesday, May 5, 2015

ఇది కాస్త ఘాటైన పోస్టు




పోస్టుకో రకంగా నా మీద అభిప్రాయాలని మార్చుకునే వారు, సున్నిత మనస్కులు (ఆడైనా - మగైనా) ఈ వాక్యం తో ఆగిపొండి. కాదు కూడదు అని ముందుకెళ్లి, తలా తోక లేని ప్రశ్నలు, అర్ధం లేని ఆవేశం ప్రదర్శిస్తూ కామెంట్లు చేస్తే నేను స్పందించను. అదన్నమాట...!!

ఇక విషయానికి వస్తే, మణిరత్నం అనే దర్శకుడు తాజాగా తీసిన ఒక సినిమా "ఓకే బంగారం", కొందరికి " ఓకే వెండి", ఇంకొందరికి "ఓకే రాగి", మరికొందరికి "ఓకే ఇత్తడి".. ఏదో ఒకటి, ఆ సినిమా గురించి ఇప్పటికీ కొందరు తమకి 'అనిపించిన' భావాలను వ్యక్తపరుస్తున్నారు... సంతోషం.. అందులో ఏ మాత్రం తప్పులేదు. కాకపోతే, ఒక దర్శకుడి ప్రతిభని కొలవడానికి అంతకనే ఉత్తమమైన దర్శకులు, ఒక రచయిత పనితనాన్ని పొగడటానికో - తెగడటానికో అంతకంటే ఉత్తమైన రచయితలు...అదే విధంగా సంగీత దర్శకులు- ఛాయాగ్రాహకులు, నటీ నటులు , ఇతర సాంకేతిక నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. కానీ, సినిమా పట్ల ప్రేక్షకుడి తాలూకు అభిరుచిని, ప్రేమని, పిచ్చిని కొలవడానికి ఉత్తమ ప్రేక్షకుడు, సినిమా 'చూడటంలో' నిష్ణాతుడు అంటూ ఎవరూ ఉన్నట్టు నాకైతే తెలియదు మరి. బహుశా, అందుకేనేమో సినిమా చూస్ ప్రతీ ప్రేక్షకుడు ఈ మధ్య సినిమా చూడటం తో ఆపేయకుండా, ప్రపంచంలో తానే అత్యుత్తమ ప్రేక్షకుడిగా గుర్తింపు పొందే తాపత్రయంలో సినిమాని చీల్చి చెండాడుతూ 'రివ్యూయర్' అవతారం ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. (ప్రేక్షకులని తప్పు పట్టడం, తక్కువ చేయడం ఎంతమాత్రం నా అభిమతం కాదు అని చెప్పుకోవడానికి చింతిస్తున్నాను... ఈ మాత్రం కూడా అర్ధం చేసుకోలేని వారు ఇది చదువుతారని తెలిసి).

నల్ల కోటు వేసుకునే లాయరు, ఆసుపత్రిలో కూర్చుని రోగులని చూడటం అంత బాగోదేమో?? సిమెంటు- ఇసుక కలిపి ఇల్లు కట్టే తాపీ మేస్త్రీ వంద అంతస్తుల భవనానికి ప్లాను గీస్తే అస్సలు బాగోదేమో? ఈ క్యాటగిరికి చెందిన వాళ్ళు విషయం అర్ధం చేసుకుని ఇక్కడితో ఆగిపోగలరు.. ముందు చదివితే ఇంకా అస్సలు బాగోదేమో?

ఒక సినిమా చూసిన ప్రేక్షకుడికి, లేదా రివ్యూయర్ కి నిజంగా తన మనసుకి అనిపించింది అనిపించినట్టు వ్రాస్తే ఏ గొడవా లేదు. అలా కాకుండా, తమ so called intelligence ని ప్రపంచం మీదకి అభిప్రాయం, రివ్యూ ల రూపంలో విసిరి కాలర్ ఎగరేసుకుందాం అని , తనకి నిజంగా అనిపించనివి కూడా అనిపించినట్టు , పది మందిలో "వీడు ఎవరూ టచ్ చేయని అంశాలని ప్రస్తావించాడు" అనే ఒక సర్టిఫికేట్ పొందాలనే కోరికతో ఉద్దేశపూర్వకంగా ఆ సినిమా పట్ల తన పైత్యాన్ని, అర్ధం చేసుకోలేనితనాన్ని, అజ్ఞానాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇష్టం వచ్చినట్టు వ్రాస్తూ ఉండకపోతే నేను ఇది వ్రాసే వాడిని కాను.

సో..విషయం ఏంటి అంటే... ఒక అమ్మాయి- అబ్బాయి కలిసి ఉందాం అనుకోవడం కేవలం శారీరక వాంఛలు తీర్చుకోవడానికేనా? అర్ధం చేసుకోవడానికి కాకూడదా? ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిప్రాయం సరైనదో కాదో తెలుసుకోవడానికి కాకూడదా? ఇద్దరూ కలిసి జీవితంలో ముందుకి ప్రయాణించడానికి సరైన నిర్ణయం తీసుకోవడానికి కావలసినంత సమయం తీసుకుంటున్నారని అనుకోకూడదా? లేదా, like minded people ఇద్దరు తమకి ఉన్న కొద్ది సమయాన్ని సరదాగా ఒకరితో ఒకరు కలిసి గడపడానికి అనుకోకూడదా? సరదా అంటే సెక్స్ మాత్రమేనా? అదొక్కటే చూపించాడా మణిరత్నం? ఒక ఆడ మగా కలిసేది, కలిసి ఉండాలని అనుకునేది కేవలం కామ వాంఛ తీర్చుకోవడానికేనా? ఇలాగేనా సినిమాని అర్ధం చేసుకోవడం? ఈ లెక్కన..

లాంగ్ లాంగ్ ఎగో... సో లాంగ్ ఎగో ఒక తమిళ కుర్రాడు, ఒక సాంప్రదాయమైన తెలుగు యువతిని ప్రేమించాడు... సారీ కామించాడు.  అది అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెద్దలకి నచ్చదు. కానీ, పైకి మంచితనం నటిస్తూ ఆ అబ్బాయి ఒక ఏడాది పాటు బయట ఉండి ఆ తరువాత వచ్చాక కూడా ఆ అమ్మాయి పట్ల అంతే ప్రేమ , మళ్లీ సారీ... అంతే కామం ఉంటే పెళ్లి చేస్తాం అని పెద్దలు చెబితే సరే అని ఆ అబ్బాయి అమాయికి దూరంగా వెళ్ళిపోతాడు. తీరా ఆ అబ్బాయి వచ్చే రోజున ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయి మానాన్ని దోచుకుంటాడు. ఎర్రగా బుర్రగా ఉండే తాను  కామించిన మనిషితోనే కామ వాంఛ తీర్చుకోవాలని అనుకున్న అమ్మాయి తనకి ఇష్టం లేని వ్యక్తి తనని అనుభవించడం, తాను కామించిన మనిషితో మొట్టమొదటి సారి కామ వాంఛ తీర్చుకునే అపురూపమైన అవకాశాన్ని తాను కోల్పోవడం జీర్ణించుకోలేని ఆ అమ్మాయి  బాధతో ఆత్మ చేసుకుంటుంది. అది చూసి ఆమెని ప్రాణంగా కామించిన అబ్బాయి, ఆ అమ్మాయితోనే మొదటిసారి కామా వాంఛ తీర్చుకోవాలి అనుకున్న ఆశ ఇక ఎప్పటికీ తీరదు అని  నిరాసతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు... అని కూడా అర్ధం చేసుకోవచ్చుగా...!!

ఒక బాగా డబ్బున్న తండ్రి పెంపకంలో తనకి ఏమాత్రం ఇష్టం లేనట్టుగా పెరిగిన ఒక అబ్బాయి... తన తండ్రి చూసిన అమ్మాయితో సంబంధం కుదిరాక కూడా తన కళ్ళకి కామ దేవత లా కనిపించిన ఒక అమ్మాయితో తన కామ వాంఛ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆ అమ్మాయి  కూడా మనం కామ వాంఛాలు తీర్చుకునే ముందు నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటుంది. అర్ధరాత్రి ఐస్క్రీమ్ కావాలి అంటే, హీరొ మొదటి సారి జీవితంలో తన ఇంటి గోడ దూకి బయటకి వస్తాడు. ఆ ఐస్క్రీమ్ అమ్మే అబ్బాయిని  కూడా తన మాటలతో, కామంతో కట్టి పడేసి పేరుతో సహా పిలిచే తన కలుపుగోలుతనానికి ముచ్చటపడ్డ అబ్బాయి, తన తండ్రిని ఒప్పించి... వారం రోజులు తన ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేస్తాడు. ఈ వారంలో తను మీ అందరికి కచసిహ్తంగా నచ్చుతుంది అని నమ్మకంగా తండ్రికి చెప్తాడు. ఈ వారం రోజుల్లో... అబ్బాయితో ఎలాగైనా తన కామ వాంఛాలు తీర్చుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఆ అమ్మాయి అబ్బాయి వాలింట్లో అందరినీ తన నడవడికతో ఆకట్టుకుంటుంది. చివరికి, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్ల ఆ అమ్మాయి అబ్బాయి ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ తరువాత ఆ అబ్బాయి తన తప్పు తెలుసుకుని, ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళి అమ్మాయి వాలింట్లో ఏడు రోజుల పాటు ఉంది, అమ్మాయి వాళ్ళ నాన్నని ఒప్పించి తాను కామించిన అమ్మాయితో తన కామ వాంఛలు తీర్చుకోవాలని డిసైడ్ అయి సక్సెస్ అవుతాడు.... అని కూడా అర్ధం చేసుకోవచ్చుగా...??

అర్ధం చేసుకోవచ్చు ఏమిటి... ఇంతకంటే బాగా అర్ధం చేసుకున్న జనాలు కూడా ఉండే ఉంటారు.... అలా అని వాళ్ళందరికీ సినిమా చూడటం వచ్చు అనా? వాళ్ళకి ఏం అర్ధమైందో, ఎలా అర్ధమైందో చెబితే... సినిమా నిజంగానే అలా ఉన్నట్టా? పోనీ పది మంది బాలేదు అంటే బాలెనట్టు, బాగుంది అంటే, బాగున్నట్టూనా?

 వివాహ వ్యవస్థని ఎగతాళి చేశాడు మణిరత్నం :

నిజమా? తోటకూర కట్టేమీ కాదు? నాకిక్కడ ఒక్క ప్రశ్న అడగాలనిపిస్తుంది.. ఏమాత్రం ఒకరితో ఒకరు పెద్దగా పరిచయం లేని ఒక ఆడ మగ
దగ్గర అవ్వడానికి ప్రేరేపించేది శారీరక ఆకర్షణా? ప్రేమనా? పెద్దల పట్ల భయమూ - భక్తి నా?ఇంకేదైనా నా? రోడ్డు మీద పోయే ఒక ముక్కూ మొహం తెలియని వాడు వచ్చి చేయి తగిలిస్తేనే లాగి ఒక్కటిచ్చే భారత స్త్రీ, ఒక ముక్కూ మొహం తెలియని వాడు వంద మంది మధ్యలో, వేద మంత్రాల సాక్షిగా మెడలో తాళి కట్టి , పక్క రోజు పక్కలో భుజం మీద చేయి వేస్తే ఎలా లొంగి పోతోంది? దానికి కారణం నిజంగా ప్రేమ అనుకోగలమా? లేక ఎన్నో ఏళ్ల బట్టి అణుచుకున్న కామ వాంఛలు అనుకోవచ్చా?  లేక, పెళ్లి అయ్యేదే సెక్స్ కోసం కదా .."తప్పదు" అనే నిస్సహాయత అనుకోవచ్చా? లేక భార్య అంటే భర్తని "సుఖ పెట్టడం", ఎప్పుడు పిలిస్తే అప్పుడు పక్కన "మూడ్ లేదు", "ఇష్టం లేదు" అనే మాటలు మాట్లాడకుండా పడుకోమని పెద్దలు నూరి పోసిన దాని ఫలితం అనుకోవచ్చా?? అంటే పెళ్లి అనేది శృంగారానికి లైసెన్స్ అనుకోవచ్చా? పెళ్లి అనేది ఆడ- మగ ఎప్పుడు అంటే అప్పుడు తమ వాంఛలు తీర్చుకోవడానికి సహాయపడే వారం అనుకోవచ్చా?

ఇదే విషయం "పెళ్లి అనే సర్టిఫికేట్" ఉంటే ఇదంతా కరెక్ట్ అయిపోతుందా" అని అడిగిన అమ్మాయి తెగించింది అయిపోయిందా? కామంతో తహతహలాడుతున్నది గా కనబడిందా? ఓకే బంగారం సినిమాలో ని హీరో హీరోయిన్ల మధ్య శారీరక వాంఛలె తప్ప మరొకటి లేదు అనుకుంటే, ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి, సినిమాలు చూడటానికి.... షికార్లు చేయడానికి, అమ్మాయి పని మీద మూడు రోజులు ఊరేళ్తున్నా అంటే...ఏదో మిస్ అవుతున్న ఫీల్ వచ్చిన అబ్బాయి చెప్ప పెట్టకుండా తాను కూడా అమ్మాయితో పాటు ఊరు వెళ్ళడానికి ... ఒకే రూములో కలిసి పడుకునే సందర్భం వచ్చినా, సరదాగా పాడుకుని ఆ రాత్రి గడపడానికి ...ఏం మొహమాటం? ఆ రెండు పాత్రల ధ్యేయం కామమే, శారీరక వాంఛలె అయితే ఇద్దరి మొదటి కలయిక దగ్గరి నుండే అదే పనిలో ఉన్నట్టు చూపిస్తే మణిరత్నం ని అడిగేదెవ్వడు? మరి అలా చూపించడానికి మణిరత్నం కి వచ్చిన మొహమాటం ఏమిటి?

ఆ మాత్రం sensibilities లేని దర్శకుడె అయి ఉంటే... తాను తీసుకున్న ప్లాట్ కి విచ్చలవిడిగా ఒక ఇరవై ముప్పై మసాలా బెడ్‌రూమ్ సీన్స్ పెట్టి ఉండేవాడు కదా? live-in relation అంటే అలాగే ఉంటుంది అని చెప్పి తప్పించుకునేవాడు కదా? మధ్యలో గణపతి - భవాని పాత్రలని పెట్టి, కామాన్ని పండించే ఎంతో స్క్రీన్ టైమ్ ని వేస్ట్ చేసుకున్న మణిరత్నాం కి , సినిమా ఎలా తీయాలో ఇరానీ హోటల్ లో ఛాయ్ తాగుతూ లెక్చర్లు ఇద్దాం...

యూత్ కి చెడు సంకేతాలు వెళ్తాయి:

గులాబ్ జాం ఏమీ కాదూ? భగత్ సింగ్, అల్లూరి సీతారామ రాజు, ల గురించి చదివి, వాళ్ళ సినిమాలు చూసి ఎంతమంది అలా తయారవుతున్నారు? సెక్స్ గురించి, ప్రేమ గురించి మాట్లాడితే అటు వైపు మాత్రమే ఆకర్షించ బడుతున్నారు అని లబోదిబోమనడానికి?
చెప్పే విషయాన్ని, చెప్పే పద్ధతిలో  చెప్పే మోతాదులో చెబితే ఎవరైనా వింటారు. కేవలం సినిమాలే యువతని చెడగొడుతున్నాయి అని బురద జల్ళకండి... మీ చేతకాని పెంపకాలకి సినిమాని నిందించకండి..

నేను మణిరత్నం కి ఏసీ, ఫ్యాను, టేబుల్ ఫ్యాను, విసనకర్ర అని కాదు.... నాకు 'కనిపించే ' సినిమాని కనిపిస్తున్నట్టే, నిజంగా - నిజాయితీగా చూసి నాకు అంతే నిజంగా - నిజాయితీగా అనిపించింది చెప్పే సగటు సినీ ప్రేమికుడిని  అంతే..!! నా జీవితంలో నేను వ్రాసిన అతిపెద్ద వ్యాసం ఇదేనేమో బహుశా... ఇంకా వ్రాయాలి అనిపిస్తోంది కానీ - చిరాగ్గా ఉంది.... స్వస్తి..!!

చివరి మాట: మీ పైత్యాన్ని జనాల మీద రుద్దకండి (మీరు రుద్దారు కదా అనే సొల్లు ప్రశ్న వేసేవాళ్ళు జీవితంలో మీ  సోది ప్రొఫైల్ తో నాకు కనిపించకండి.)

-శతఘ్ని..!!