రాజకీయ నాయకుల లాగా మనలో మనం ఎప్పటి నుంచి ప్రతీదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాం? ఎప్పటినుంచి మనలో మనం ప్రాంతీయ-భాషా విబేధాలని రెచ్చగొట్టేలా కుమ్ములాడుకుంటున్నాం? జాతీయ, అంతర్జాతీయ సమస్య అయినట్టు ఆఖరుకి ఒక సినిమా విషయంలో కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నాం? ఇక్కడ ఈ ప్రస్తావన తీసుకురావడం ఒక రకంగా అనవసరమె అయినా, మరో రకంగా ఒక విషయం గురించి మనం మాట్లాడుకోక తప్పదు.
ఎంతమంది ఆంధ్రా దర్శకులు తెలంగాణా మాండలికం ని కించ పరిచేలా, తెలంగాణా ప్రజలని అవమానపరిచేలా హాస్యాస్పదంగా ఎన్ని సినిమాల్లో చిత్రీకరించలేదు? కోడి గుడ్డు మీద ఈకలు పీకడం తెలంగాణా వాళ్ళకి చేతకాకనా? ప్రతీ అయిన దానికి కాని దానికి తెలంగాణా ప్రజలు గొడవ చేయలేకనా? ఒక సినిమాని సినిమాలా చూడటం మనం ఇంకెప్పుడు నేర్చుకుంటాం?
ఒక పక్క "ఆంధ్రాపోరి" చిత్ర దర్శకుడు అంత స్పష్టంగా వివరణ ఇచ్చాక కూడా ఏమిటీ హడావిడి నాకు అర్ధం కాదు. "ఆంధ్రా" అనే పదాన్నే అసలు వాడకూడదా? ఆ పదానికి ఏమైనా పేటెంట్ తీసుకున్నారా ఎవరైనా? తెలంగాణా మాండలికంలో అమ్మాయిని పోరి అని , అబ్బాయిని పోరడు అని సంబోధించడం సర్వసాధారణం... అదేదో బూతు అయినట్టు, మనోభావాలు... వగైరా అంటూ ఇంతలా ఒకరిని చూసి మరొకరు రెచ్చగొట్టుకోవడం, అమ్మాయిల పేరుతో ఫేస్‌బుక్ లో ఫేక్ అకౌంట్లు కూడా సృష్టించి ఇలా దాడికి దిగడం ఎంతవరకు సమంజసం? "ఆంధ్రాపోరి" కి బదులు " ఆంధ్రా పోరడు" అని పెట్టి ఉంటే ఇంతమంది నోళ్ళు లేచేవా? సినిమా చూసేదాకా కూడా ఆగదా ఎవరికి? సినిమాలో కనుక "ఆంధ్రా" అమ్మాయిలని నిజంగా కించపరిచే విధంగా ఏమైనా సన్నివేశాలుంటే అప్పుడు నిరసన గళం ఎత్తే వాళ్ళలో నేనే ముందుంటాను...!! ఓపిక ఉండాలి కదా దేనికైనా?
కొంతమంది చేసే అతి చూస్తుంటే అసలు ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలో, ఎలా మర్యాదగా ప్రవర్తించాలో తెలంగాణా వాళ్ళకి అసలు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. కొన్ని విషయాలు ఎక్కడికి ఆపాలో అక్కడికి ఆపేస్తే అందరికి క్షేమం... అనవసరమైన గొడవలు పెట్టుకుని, రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర- తెలంగాణా ప్రజల మధ్యన మిగిలిఉన్న కొద్దిపాటి ప్రేమని కూడా మనమే ఛంపేస్తున్నాం..!!
అటు సాటి మనుషులని గౌరవించుకోలేక, ఇటు భాషని గౌరవించుకోలేక, ప్రాంతాలని గౌరవించుకోలేక ఎందుకు ఇక మనం మనుషులం అని చెప్పుకోవడం? మాట్లాడితే ఒకరి మీద ఒకరం పడి ఏడవటమేనా జీవితమంతా? కలిసి నవ్వుకోలేని పరిస్థితులు, ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకోలేని పరిస్థితులు, ఎక్కడైనా ఎదురుపడితే కుల-మత-ప్రాంతాలకి అతీతంగా .. అవేమీ పట్టించుకోకుండా ప్రేమగా ఒకరినొకరు సోదర భావంతో ఆలింగనం చేసుకోవడం పక్కనపెట్టండి, కనీసం కరచాలనం కూడా చేసుకోలేనంతగా మనం చెడిపోయామా?
కేవలం ఒక సినిమా టైటిల్ విషయంలోనే ఇంతలా విషం చిమ్ముకుంటుంటే, రేప్పొద్దున... సీమ వెంకటేశ్వరసామి దర్శనానికి వెళ్ళి వచ్చాము... ఆంధ్రా దుర్గమ్మ ఆశీర్వాదాలు తీసుకున్నాము... తెలంగాణా నరసింహస్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం... అని... కూడా మాట్లాడుకునే దౌర్భాగ్యపు స్థితికి చేరుకుంటే ఆ పాపం ఎవరిది? అప్పుడు ఎవరు ఎవరిని నిందించుకుంటారు?
ప్రతీ ఒక్క దానికీ ఇలా ప్రాంతీయ విభేదాలని అంటకడుతూ వెళ్తే, ఒకరికొకరం అంటరానివారమైపోమా కొన్నాళ్ళకి?వందల ఏళ్ల నుండి కులం- మతాల పేరిట జరిగే దాష్టీకాలనే ఇప్పటికీ మాపలేకపోతున్నాం... ఇక ఆ జాబితాలోకి నయం చేయలేని వ్యాధిలా ఈ ప్రాంతీయ విభేదాలు కూడా మారితే మన తెలుగు జాతి ఇక బాగుపడ్డట్టే...!!
ఈ టపా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని నా మీద పీకల దాకా కోపం వచ్చినా, నా మీద మరోసారి అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చినా వెంటనే నన్ను నిర్మొహమాటంగా "బ్లాక్" చేసుకోవచ్చు... నర్సరీ చదివే పిల్లల్లా ఆలోచించే జనాలకి వివరణలు- సంజాయిషీలు ఇచ్చే ఓపికలు ఎవరికీ లేవిక్కడ...
అర్ధం చేసుకున్న వాళ్ళు ఆలోచించండి.... కాని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి..!! కానీ, ప్రతి దానికి తెలంగాణా ప్రజలని విలన్లుగా చిత్రీకరించే అలవాటుని దయచేసి మార్చుకోండి..!! భౌగోళికంగా ప్రాంతం మాత్రమే విభజించబడ్డది... మనుషులు కాదు, మన ప్రేమలు కాదు... అన్నింటికీ మించి మనలోని మానవత్వం కాదు...!!
ఇది తెలంగాణా వాడి బాధ కాదు.... "తెలుగు వాడి" బాధ....!! ఇక సెలవు..!!
-శతఘ్ని..!!
No comments:
Post a Comment