Thursday, November 7, 2013

సచిన్ చేసిన పాపమేమి.... సామీ ??



ఖర్చులకి సరిపడా డబ్బులేని వాడు బాగా డబ్బున్న వాడిని చూసి బాధపడటంలో అర్ధం ఉంది..
బాగా ఆడలేనివాడు, తనకంటే బాగా ఆడగలిగిన వాడిని చూసి అసూయపడటంలో అర్ధం ఉంది...
కానీ, కటిక పేదవాడు...కోటీశ్వరుడిని చూసి బాధ పడటంలో... అసలు ఆడటమే రాని వాడు బాగా ఆడేవాడిని చూసి అసూయపడటం ఏమిటో నాకు అర్ధం కాదు.

Survival of the fittest ....అన్న సూత్రాన్ని మనమెందుకు మరచిపోతామో ఒక్కోసారి అర్ధం కాదు. బ్రతుకు బండిని లాగడానికి తమ శక్తి సామర్ధ్యాలకి తగ్గట్టు, తమ తెలివి తేటలకి- నైపుణ్యాలకి తగ్గట్టు, తమకున్న పరిధిలో, తమకు అందుబాటులో ఉన్న అవకాశాలని ఆధారం చేసుకుని... ఎవరికి వారు తమకి నచ్చిన మార్గాలని వెతుక్కుంటారు.

ఇందులో, నువ్వెక్కువ-నువ్వు తక్కువ అనడంలో అర్ధం ఏమిటో నాకు ఏమాత్రం బోధపడదు. సమన్యాయం జరగడం లేదు అనే వాదన లోని పరమార్ధం నాకిప్పటికీ అంతు చిక్కడం లేదు. ఒక కూలీ పని చేసుకునే వాడితో సచిన్ ని ముడిపెట్టి మాట్లాడటం ఏమిటో అసలు? ఆ మాటకొస్తే, మన అందరికీ ఒక్కో కుటుంబ, విద్యా,ఆర్ధిక నేపధ్యాలున్నాయి. ఎవరికి వారు తమన్ పనుల్లో పడిపోయాం. అంటే, మన వల్ల కూడా కూలీ పనులు చేసుకునే వాళ్లకి సమన్యాయం జరగకుండా పోయింది అని ఒప్పుకుందామా??మనం కూడా ఏసీ లో కూర్చుని పని చేసుకుంటున్నాం కనుక, మనం కూడా కూలీల పొట్ట కొట్టాము.... వాళ్లకి ద్రోహం చేసాం అనుకుందామా?

వేరు వేరు రంగాల్లోని ఇద్దరు వ్యక్తులని పోల్చడం అనే కాన్సెప్ట్ కి నేను బడ్డ వ్యతిరేకిని. సచిన్ సామర్ధ్యాన్ని , నైపుణ్యాన్ని , ఆట తీరుని ప్రశ్నించాలి/ విశ్లేషించాలి అనుకున్నప్పుడు, ఒక బ్రాడ్మన్ తోనో, లారాతోనో, వివియన్ రిచర్డ్స్ తోనో , సునీల్ గవాస్కర్ తోనో, రికీ పాంటింగ్ తోనో, మరోకరితోనో పోల్చి మాట్లాడండి... చీల్చి చెండాడండి ..కాదన్నదెవరు? కూలీ పని చేసుకునే వాడికి-సచిన్ కి సంబంధం ఏమిటి అసలు ?? పేదరికంలో ఉన్న మనుషుల ఇబ్బందులకి, కష్టాలకి సచిన్ కారకుడా? వాళ్లకి ద్రోహం చేసి, సచిన్ అంత స్థాయికి ఎదిగాడా? వాళ్ళ కూలీ డబ్బులు కాజేసి, సచిన్ అన్ని కోట్లు పోగేసుకున్నాడా?

ఇద్దరు వ్యక్తులని పోల్చాలి అనుకున్నప్పుడు, ఒకే రంగంలోని మనుషులని పోల్చితే సముచితంగా ఉంటుంది కానీ,

మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మార్లిన్ మన్రో, ఐన్స్టీన్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ , గౌతమ బుద్ధ, రామకృష్ణ పరమహంస, లియోనార్డో డావిన్సి, ఓప్రా విన్ఫ్రే , లియో టాల్స్టాయ్ , మదర్ థెరీసా, రవీంద్రనాధ్ ఠాగోర్ , పీలే , పీట్ సంప్రాస్, మైఖేల్ షూమాకర్, బ్రూస్లీ, జిమ్మీ వేల్స్, బిల్ గేట్స్, షేక్స్పియర్ ,స్టీఫెన్ హాకిన్గ్స్ , అబ్దుల్ కలాం ,ఆంగ్ సాన్ సూకీ, లతా మంగేష్కర్, ఏ.ఆర్. రహ్మాన్, ఘంటసాల, దిలీప్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, విశ్వనాద్ ఆనంద్, టాటా, బిర్లా, నారాయణమూర్తి, కార్ల్ లూయిస్, టిప్పు సుల్తాన్, అల్లూరి సీతారామరాజు ,మైఖేల్ జోర్డాన్, సచిన్ టెండూల్కర్, అమ్మ, భార్య, బిడ్డలు, రైతు, పేదవాడు, కార్మికుడు ,సైనికుడు మొదలగు వాళ్ళలో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం?

ఎవరికి వారు తమ -తమ రంగాల్లో వాళ్ళ దేశాలకి ఎంతో సేవ చేసిన వాళ్ళు, అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి గడించి పెట్టిన వాళ్ళు. ఎవరి పని వారు చేసారు... ఎవరి బాధ్యతని వారు నిర్వర్తించారు. సచిన్ కి, సామాన్య కూలీ కి ముడిపెట్టి మాట్లాడినట్టే, పైన పేర్కొన్న ప్రతి ఒక్కరితోనూ సామాన్య కూలీని ముడిపెట్టి మాట్లాడుకుందామా...(వేలల్లో...లక్షల్లో జీతాలు తీసుకుని, కార్లల్లో-ఫ్లైట్లల్లో తిరుగుతూ-అద్దాల మేడల్లో ఉండే మనలో చాలామందిని కలుపుకుని) . పేద రైతు కూలీ ఎండల్లో మాడుతూ పని చేస్తున్నాడు కనుక, ఏసీ గదుల నుండి బయటకొచ్చి మన దేశంలో పేదరికం నిర్మూలించాబడే వరకు, మనం కూడా రోడ్ల మీద కూర్చుని పని చేద్దామా మరి?

" డబ్బులేకపోవడం పేదరికం కాదు.... డబ్బు సంపాదించుకోలేకపోవడం నిజమైన పేదరికం... ".

పేదరికాన్ని చూసి జాలిపడే వాళ్ళంటే నాకు చిరాకు. చేతనైతే, వాళ్లకి తగినంత సంపాదన జాడ చూపాలి కానీ, జాలిపడటం ఏమిటి అసలు? ఒక వ్యక్తి సంపాదించలేకపోతున్నాడు సరిగ్గా అంటే, అతడిని ఎంతమంది తోక్కేస్తున్నారు, అతనిపై ఎంతమంది కుట్రలు పన్ని కిందకి లాగేస్తున్నారు అనేదాని కంటే, ఆ వ్యక్తి తాలూకు తెలివిలేనితనం, చేతకానితనం, బద్ధకం, ప్రణాలికా లోపాలు మొదలైనవే ప్రధాన కారణాలు అంటాన్నేను. మన ఎదుగుదలకి, మన పతనానికి బాధ్యతా మనమే తీసుకోవాలి కానీ, ఇంకొకరిని బాధ్యులని చేయడం ఏమిటి అన్నది నాకు అర్ధం కాదు.

ఏ పనిలో ఉండే సౌందర్యం ఆ పనికి ఉంటుంది. "కష్టం" అనేది ఏ రంగంలో అయినా ఒక్కటే... దాన్ని పడటంలోనే సారూప్యాలుంటాయి. శారీరకంగా కష్టపడే వారు కొందరైతే, మానసికంగా కష్టపడే వారు మరికొందరు.మండుటెండల్లో చెమటలు కక్కడమే నిజమైన కష్టం, శ్రమ అనుకునేట్టైతే... ప్రపంచంలో మిగతా జనాలదరూ దద్దమ్మలా? ఎందుకూ పనికిరాని వారా? ఎవరు గొప్ప అనే అసమంజస వాదనలు తీసుకొచ్చి, మనకి మనమే దూరం అయిపోవడం .. మనలో మనమే అసమానతలని పెంపొందించుకోవడం అనేది ఊహించని పతనానికి దారి తీస్తుంది. సగం చాచిన సమాజం, పూర్తిగా చచ్చిపోతుంది.

నేను ఏ రంగం వారినీ ఎక్కువ చేసి మాట్లాడటం లేదు... తక్కువ చేసి అంతకన్నా మాట్లాడటం లేదు. ఇకనైనా మూస ధోరణిలో ఆలోచించడం మానేసి, అందరం అందరినీ, అన్ని పనులు చేసుకునే వాళ్ళని గౌరవిస్తూ ముందుకు సాగుదాం... దేశాన్ని ప్రగతి పథాన నిలబెడదాం. ఎందుకంటే, దేశం ఎదగాలంటే, కార్మికులు-ఇంజనీర్లు-డాక్టర్లు-మొదలైన వారందరూ అవసరమే.. ఒక రంగం వారిపట్ల మనకి ఆసక్తి, ఆదరణ ఉండొచ్చు కానీ, అది మరొక రంగం వారిపట్ల ద్వేషం-అసూయగ మారకూడదు అన్నది నా ఇంట పెద్ద టపా వెనుకన ఉన్న ఉద్దేశం.

Note: నేనేమీ సచిన్ అంటే చెవులు-ముక్కు కోసుకునేంత వెర్రి వీరాభిమానినేం కాదు. కాకపొతే, ఒక వ్యక్తి పట్ల అసమంజసమైన ద్వేషాన్ని ఇంత స్థాయిలో వ్యక్తపరచడం అనే విధానాన్ని చూసి తట్టుకోలేక ఇది వ్రాయడం జరిగింది. నేడు సచిన్ స్థానే, వేరేవరున్నా రేపో. మరునాడో నా నుండి ఈ పోస్ట్ వచ్చి ఉండేదే.

-శతఘ్ని...!!

Saturday, July 6, 2013

సక్సెస్ మైనస్ ఫెయిల్యూర్స్...



జననమొక సక్సెస్ జన్మనిచ్చినవాళ్ళకి
మరణమొక ఫెయిల్యూర్ నమ్ముకున్నవాళ్ళకి
నడుమ బ్రతుకున లెక్కలన్నీ నా ఒక్కడివేనా??

ఎన్ని పొందానో
ఎంత పోగొట్టుకున్నానో
పద్దు రాసుకుంటూ పోతే
హద్దులు ఎరుగుదునా??

గెలుపునో, ఓటమినో
సొంతం చేసుకోవడానికి
నాకు నచ్చిన ఆటని
నన్నెక్కడ ఆడనిచ్చారసలు??
బలవంతపు ఆరంభాలు
అయిష్టపూర్వక ముగింపులేగా అన్నీ??

పదిసార్లు పడిలేస్తే కానీ
నడక రాలేదు....
పన్నులూడగొట్టుకుంటే కానీ కాళ్ళకి
పరుగు రాలేదు...
మోకాళ్ళు,మోచిప్పలు పగలకొట్టుకుంటే కానీ
సైకిలు రాలేదు....

పోగొట్టుకుంటే కానీ
జాగ్రత్త తెలియలేదు...
కోల్పోతే కానీ
పొందడం తెలియలేదు...
అప్పులైతే కానీ
పొదుపు తెలియలేదు...
గాయమైతే కానీ
నొప్పి తెలియలేదు...
భారాన్ని మోస్తే కానీ
బాధ్యత తెలియలేదు...

ఏదైనా నేర్చుకునే ముందో
కొత్తగా తెలుసుకునే ముందో
ఏదో ఒకటి  నష్టపోవడం జరిగితేనే
అది ఓటమి అంటే.....

ఏదైనా పోగొట్టుకున్న తరువాతో
ఎంతో కొంత నష్టపోయిన తరువాతో
ఏదో ఒకటి లాభం రావడం జరిగితేనే
అది గెలుపు అనుకుంటే....

నా గెలుపులన్నీ లాభం లేనివే..
నా ఓటములన్నీ నష్టం లేనివే....

ఎందుకంటే,
పోగొట్టుకున్నాక పొందినది గెలుపు కాదు
పొందాక పోగొట్టుకున్నది ఓటమీ కాదు
నా దృష్టిలో ఎప్పటికీ....!!


Monday, April 1, 2013

అడుగు సాగని నా ప్రయాణం

నొప్పి తెలియని గాయాల బాధని ఓర్చుకుంటూ
తీరం లేని దూరాలకి
తాపీగా నడుచుకుంటూ వెళ్ళే నాకు,

ముప్పూటలా
అవసరం లేని ఆకలి వేస్తుంది..
అనవసరమనిపించే దాహమూ వేస్తుంది ..
అర్హతలేని ఖర్చులతో
అన్ని అవసరాలనూ తీర్చుకుంటూ...

దిశ లేని ప్రయాణాన్నలా
కొనసాగిస్తూ ....
అలుపురాని చోట
అప్పుడప్పుడూ ఆగుతుంటాను ..

చేయని ప్రయత్నంలోని
నా చేవని చూసి పొంగిపోతూ
సాదించని గెలుపులని లెక్కిస్తూ
సాటిలేరు నాకెవ్వరూ అనే
సర్వోన్నతమైన " భ్రమ " ని బలపరుస్తూ

ఇసుకరేణువునై
సాగరాన్ని పూడ్చేద్దామనే సంకల్పంతో
అయాచితంగా వచ్చిపడే
పొగడ్తల మూటల్లోంచి రాలిపడే
మాటల కింద,
నా ఆత్మాభిమానాన్ని పాతిపెట్టి,

చివరకి,
ఆపాదించబడ్డ గొప్పదనమనే
గొయ్యి తీసుకుని అందులో దాదాపుగా
పడబోయే సమయంలో ...

నాలో నిర్జీవంగా
పడి ఉన్న నన్ను నేను గుర్తించి
మంచుతాకిడికి ఆరిపోయే
మంటని మరోసారి రగిలించి
ముందడుగేస్తాను ...

ఎదగాల్సిన వైపుకో
ఎటూకాని వైపుకో అన్నది
కాలమే నిర్ణయిస్తుంది ..

మందుకంటే తొందరగా దిగిపోయే
మరొకరి మాటల మత్తుకి
అనుకున్నంత తేలికగా బానిసైపోతే,
రూపాయి విలువచేయని
నాలోని అహం నొచ్చుకోదూ?

పోతే .... పోనీ....
మరికొన్ని లెక్కలేని
రాత్రులనీ , పగళ్ళనీ ...

మహా అయితే,
గడిచిపోయి గతమవుతాయి..
నిలిచిపోయి గాయాలవుతాయి
నిరంతరం " నిద్ర "లో ఉండే
నాకవేమీ పట్టవుగా ....!!

Friday, January 11, 2013

కనురెప్పల్లో కరిగే రాత్రి....!!

కనురెప్పల్లో కరిగిపోయేందుకు
రాత్రి సిద్ధపడగానే,
కలలొచ్చి కళ్ళలో ఆడుకుంటాయి...
మెల్లగా కదలమని రాత్రిని వేడుకుంటాయి...

నిట్టూర్పుల నిన్నల్లోకి
నిద్దుర నిన్ను తీసుకెళ్ళిపోతూంటే,
ఊరించే 'రేపట్లోకి'
ఆశ నిన్ను తోసుకెళ్లిపోతూంటే...

ఎటూ తేల్చుకోలేక
మగతలోనే ఎన్ని గంటలుంటావ్?
ప్రభాత కిరణాల ప్రసారాలు
మొదలైనా మొద్దు నిద్రేనా?

ముందడుగు వేయ్
ముదిమిలో మధుర జ్ఞాపకాల
ముసురు కమ్మేలా...
వెనుకడుగైనా వేయ్
చరితపై నీ పేరు
చేటుచేయని విషం చిమ్మేలా...
కదలకుండా కాలక్షేపం చేస్తుంటే
బ్రతుకంతా దుప్పట్లోనే బలైపోతుంది...

కాలరాత్రిలో , వృధాగా
కాలం ఖర్చుచేసే క్షణాలన్నీ
మన ఖాతాలోవే అని
మనిషికర్ధమయ్యేలోపు
మరోజన్మకి ఏర్పాట్లు
జరిగిపోతుంటాయి...

తొలి మెలకువకి
చివరి నిద్రకీ
మధ్యన సాగే జీవితం అంతా ఒక కలే...
 తనని తాను మనిషి తెలుసుకోలేకపోతే...


-శతఘ్ని...!!