Friday, January 11, 2013

కనురెప్పల్లో కరిగే రాత్రి....!!

కనురెప్పల్లో కరిగిపోయేందుకు
రాత్రి సిద్ధపడగానే,
కలలొచ్చి కళ్ళలో ఆడుకుంటాయి...
మెల్లగా కదలమని రాత్రిని వేడుకుంటాయి...

నిట్టూర్పుల నిన్నల్లోకి
నిద్దుర నిన్ను తీసుకెళ్ళిపోతూంటే,
ఊరించే 'రేపట్లోకి'
ఆశ నిన్ను తోసుకెళ్లిపోతూంటే...

ఎటూ తేల్చుకోలేక
మగతలోనే ఎన్ని గంటలుంటావ్?
ప్రభాత కిరణాల ప్రసారాలు
మొదలైనా మొద్దు నిద్రేనా?

ముందడుగు వేయ్
ముదిమిలో మధుర జ్ఞాపకాల
ముసురు కమ్మేలా...
వెనుకడుగైనా వేయ్
చరితపై నీ పేరు
చేటుచేయని విషం చిమ్మేలా...
కదలకుండా కాలక్షేపం చేస్తుంటే
బ్రతుకంతా దుప్పట్లోనే బలైపోతుంది...

కాలరాత్రిలో , వృధాగా
కాలం ఖర్చుచేసే క్షణాలన్నీ
మన ఖాతాలోవే అని
మనిషికర్ధమయ్యేలోపు
మరోజన్మకి ఏర్పాట్లు
జరిగిపోతుంటాయి...

తొలి మెలకువకి
చివరి నిద్రకీ
మధ్యన సాగే జీవితం అంతా ఒక కలే...
 తనని తాను మనిషి తెలుసుకోలేకపోతే...


-శతఘ్ని...!!









No comments:

Post a Comment