Friday, July 4, 2014

మనకేం తక్కువ...?



తొలిసారిగా నాకు కోపం
పరిచయమైన రోజులవి..
ఆరేళ్ళ వయసులో నా బలపాన్ని
ఎవడో నా చేతుల్లోంచి లాగేసుకున్నాడు..
నాకొచ్చిన దాన్ని కోపమంటారని కూడా
తెలియని వయసది....
కోపమొచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో
ఏమో నాకప్పుడు తెలియదు...
టీచరుకి చెప్తే...
చాక్లెట్టు చేతిలో పెట్టి
నా ఏడుపుని ఆపింది....

తొలిసారిగా నాకు అసూయ
పరిచయమైన రోజులవి...
పన్నెండేళ్ళ వయసులో..
నాకంటే బాగ చదువుతున్నవాడిమీద
ఏదో తెలియని ఉక్రోషం...
అప్పుడు నాకు తెలియని ఆ భావనని
అసూయ అంటారని నాకు తెలియని వయసది...
ఒక వ్యక్తి మీద అసూయ కలిగినప్పుడు
ఏం చేయాలి అన్న విషయం పట్ల ఏమాత్రం
అవగాహన నాకప్పుడు లేదు...
ఇంట్లో చెప్తే....
బాగ చదవాలి మరి అని చెప్పి,
పెద్దలు ఉపదేశించడంతో.. నా మనసు
అంతే కాబోలు అని సరిపెట్టుకుంది...

తొలిసారిగా నాకు ద్వేషం పరిచయమైన రోజులవి..
పద్దెనిమిదేళ్ళ వయసులో..
నాతో పాటే తిరిగిన నేస్తాలందరూ...
నాకంటే డబ్బులెక్కువున్నోడి స్నేహితులుగా
రాత్రికి రాత్రే మారిపొయినప్పుడు..
నా అనుకునే నా నేస్తాలను
నాకు కాకుండా చేసిన వాడంటే...
విపరీతమైన ద్వేషం పెరిగిన పరిస్థితి...
ఒక మనిషిని అంతగా ద్వేషించేటప్పుడు..
నేనెలా ఉండాలో ... ఏం చేయాలో
తెలియని ఆ సందిగ్ధావస్థలో...
వదిలెయ్ రా ... అని మిగతా స్నేహితులు
చెప్పినప్పుడు.. కష్టంగా తలూపా..

తొలిసారిగా ప్రేమ పరిచయమైన రోజులవి...
చూడగానే మనసుకి హత్తుకుపోయిన
ఆమె అందానికి నేను దాసోహం అన్న పరిస్థితి..
పాతికేళ్ళ వయసులో... తొలిప్రేమ తాలూకు
మధురానుభూతులని.. ఆస్వాదిస్తున్న నాకు..
శరాఘాతం ..
నాకంటే అన్ని రకాలుగా
మరో మనిషి తన కళ్ళకి ఉన్నతంగా కనిపించాడట..
వాడికున్న అర్హతలు...
నాకంటే ఎక్కువ ఆస్తిపాస్తులు..
నాకంటే ఎక్కువ చదువు..
నాకంటే ఎక్కువ అందం...
నీకొసం వాడు అవన్నీ వదులుకోలేడు..
కానీ.. నేను నీకోసం నా ప్రాణాన్నైనా
వదిలేసుకుంటా అన్న నా మాటలు
తన మనసులో చలనాన్ని తేలేకపోయాయి..
ప్రేమున్నచోట సర్దుబాట్లుంటాయి..
అదిలేనిచోట.. రాజీలే ఉంటాయి అంటే..
ఆ పిచ్చి మనసుకి అర్ధం కాలేదు..
పోనీలే అని వదిలేసుకున్నా...

మనిషి జీవితంలో...
ఇన్ని లెక్కలుంటాయా?
లెక్కల పుస్తకాల్లోని
చిక్కు ప్రశ్నలు నాకు చాలా
చిన్నవిగా కనపడసాగాయి...

ఎన్ని దెబ్బలు తగిలినా
నా ప్రయాణం ఆగలేదు...
ఎవరికోసమూ.. ఎవరి జీవితమూ ఆగదు..
అని తర్వాత అర్ధమైంది.....
...
నాకు పరిచయమైన నేస్తాలన్నీ
నాకు ఏదో ఒక పాఠం నేర్పించినవే..
కానీ ఒక్కటి మాత్రం నిజం...
అక్క్కర్లేదు అనుకోవడంలో ఉన్న ఆత్మ సంతృప్తి
మరి ఎందులోనూ ఉండదు....
మనకేం తక్కువ అనుకోవడంలోని మజా కూడా
ఇంకెక్కడా ఉండదు....

-శతఘ్ని...

No comments:

Post a Comment