Monday, November 26, 2012


భాషాభి "మానులకి" ఒక విన్నపం....!!


"తెలుగు"భాష ఖూనీ చేయబడుతోంది... "తెలుగు" భాష కుంటిదైపోతోంది... తెలుగు భాష ఏదో అయిపోతోంది... తెలుగు భాష ఇంకేదో అయిపోతోంది అని గగ్గోలు పెడుతూ గొంతు చించుకుంటున్న సో కాల్డ్ తెలుగు భాషాభి" మానులను" చూస్తే భలే బాధేస్తోంది ఒక్కోసారి... అంత కంటే ఎక్కువగా జాలి కూడా కలుగుతోంది... బాధ దేనికంటే, వారి బాధ కొంతవరకు నా బాధగా భావించడం వల్ల... ఇక జాలి ఎందుకంటే, సమకాలీన పద్ధతులకీ అలవాటు పడలేక... గట్టిగా మాట్లాడితే, అలవాటు పడటం చేతకాక.. మిగతావారి రాతల్లో లోటుపాట్లని టార్చి లైట్లు వేసి మరీ వెతుకుతూ ... తాము మాత్రం, ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యి కిలోలే అన్న చందాన వ్యవహరించడం వల్ల.... ఒకింత నవ్వుకుని వదిలేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.. తెలుగు భాష ఏమీ అయిపోదు... తెలుగు భాష మనుగడపై మరీ అంత బెంగ పెట్టుకోనవసరము లేదు తమరందరూ అని నా అభిప్రాయం.. భాష చచ్చిపోతోంది అని ప్రతి ఒక్కరూ ఏడుస్తారు... బ్రతికించే ప్రయత్నం తమరు ఎంత చేస్తున్నారు.. ఏం చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించుకుంటే విషయం బోధపడుతుంది...

"సంధులు" ఎందుకు లేవు... "సమాసాలు" ఎక్కడ తగ్గాయి... యతి ప్రాసలు ఏవీ? తదితర విషయాల పట్ల తర్కించుకుంటూ, ఎందుకూ ఉపయోగపడని చర్చలు జరుపుకుంటూ పది మందిలో మన స్టామినా ఎంత అని నిరూపించుకునే క్రమంలో ఒకరిపై ఒకరు విసుర్లు, విమర్శలు చేసుకుంటూ ఉంటే భాష బ్రతికిపోదు మేధావులూ.... ప్రాచీన తెలుగు పట్ల నాకు ఎనలేని గౌరవం ఉంది.. ప్రపంచంలో ఏ భాష అయినా ఉన్నది ఇద్దరు మనుషులు సునాయాసంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే... దాని దరువాత కవిత్వాలు... ఇతరత్రా రచనలు వెలుగులోకి వచ్చాయి... ఏ రచనా మాధ్యమం ద్వారా అయినా రాసేవాడి ముఖ్యోద్దేశం తాను రాసింది ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అనడంలో ఎంతమాత్రం అనుమానం అక్కరలేదు... ఎవరూ దీన్ని కాదనలేరు కూడా...!!

ఒకరు కవిత, లేదా కథ ఇలా రాయాలి అని నిర్దేశించడానికి ఎవరికి ఏం హక్కున్నదని? లోగడ పండిత పెద్దలు "కవిత్వానికి", "కథకి", "పాట" కి కొన్ని నిర్వచనాలు ఇచ్చి ఉండవచ్చు గాక... నేను ఆ నిర్వచనానికి కొత్త నిర్వచనం ఇస్తున్నా అని చెప్పడం లేదు...కానీ, అప్పటి పరిస్థితులకి , వాతావరణానికి, అప్పటి మనుషుల ఆలోచన విధానానికి అనుగుణంగా కొన్ని ప్రమాణాలు అప్పట్లో ఏర్పరచి ఉండవచ్చుగాక... కాదనడం లేదు.. కానీ, ఆచారాలూ, వ్యవహారాలు... ఆలోచనలు, అలవాట్లు కాల క్రమేణా ఇంతగా మార్పు చెందుతున్న నేపధ్యంలో... అదే పాత చింతకాయ పద్ధతుల్లోనే కవిత్వం రాయాలి... పాటలు రాయాలి... కథలు రాయాలి అనుకోవడం "అంతరిక్షానికీ పంచె కట్టు, పట్టు చీరల్లోనే వెళ్ళాలి అనుకోవడం లాంటిదే...". ఈ నా అభిప్రాయంతో ఎంతో మంది పండిత శ్రేష్టలు మండిపడవచ్చు గాక... ఈ జస్ట్ దొం'ట్ కేర్.

నాకు అర్ధంకాని విషయం ఏమిటి అంటే, మాట్లాడితే ఈ పండిత పితామహులంతా కలిసి నేటి వర్ధమాన రచయితలు, కవుల పట్ల ధ్వజమెత్తడం.. !! కొత్త నీరు రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు అన్న సంగతి వీరికి ఎందుకు గుర్తుకురాదొ నాకు తెలియదు.. కట్టుబాట్ల కంచెలని తెంచి... సాంప్రదాయం అనే పంజరం నుంచి కవిత్వానికి స్వేచ్చని ప్రసాదించిన శ్రీశ్రీ ఇప్పుడు బ్రతికి ఉంటే కనుక ఎంతగా నవ్వుకునేవాడో ... ఏమైపోయేవాడో అన్నది నా ఊహకి కూడా అందడము లేదు.. ఒఫ్ కోర్స్, ఈ దో అగ్రీ... ఈరోజుల్లో ప్రతి ఒక్కడూ పెన్నూ పేపరు పట్టుకుని రాసేయడం మొదలు పెడుతున్నాడు... అందులో తప్పు ఏమిటి?? మన రుచి, అభిరుచికి తగ్గట్టు లేని వాటినే కదా మనం విమర్శించేది, అసహ్యించుకునేది... ..!! నీ స్థాయిలో లేనంతమాత్రాన అది కవిత్వమే కాదు... వాడు అసలు కవే కాదు అని చెప్పడానికి నువ్వెవడివోయ్?? నా స్థాయిలో ఎవరూ బ్యాటింగ్ చేయట్లేదు కనుక ప్రపంచంలో నేను తప్ప అసలు బ్యాట్స్‌మనే లేడు.. అసలు వాళ్ళు ఆడేది క్రికెట్టే కాదు అని సాక్షాత్తూ బ్రాడ్మనో, టెండూల్కరో వచ్చి అన్నా, నవ్వుతుంది సామీ ప్రపంచం...

చేంతాడు అంత వ్యాసాలు రాసుకుంటూ కూర్చుంటే, మీ బ్లాగులు నిండుతాయి కానీ... నిజమైన సాహిత్యాభిమాని మనసు నిండదు. ఊకదంపుడు ఉపన్యాసాలూ, వీసమెత్తు ఉపయోగమ్ లేని విశ్లేషణలు, ఏళ్ల తరబడి కూడబెట్టుకుంటూ వస్తున్న ఎవరికీ అక్కరకురాని అనుభవం వల్ల ఇంతవరకు ఎవరికి ఎంత ఒరిగింది మీ వల్ల అని ఒక చిన్న సందేహం?? మీ "స్థాయిలో" ఉన్నాము "అనుకునే" మరికొంతమంది సో కాల్డ్ పండిత శ్రేష్టల లైకులు... కామెంట్లు తప్ప? పదిమంది మేధావులు ఒక విషయం పట్ల ఎంతబాగా ఒకరిపై పైచేయి సాధిస్తున్నాం... ఎంత బలంగా వాదిస్తున్నాం అన్నదే మీ తెలివి అయితే, అదే మీ సాహితీ సంపద అయితే... హాహాహాహా......మీకో నమస్తే...!! మండుటెండల్లో రోజంతా కూలీ పని చేసి సాయంకాలం కూలీ డబ్బులు తీస్కుని చెట్టు నీడలో కూర్చుని ఆ ఉపశమనంలో ఆ కూలీ, తనలో తాను మాట్లాడుకునే నాలుగు మాటలు కూడా కవిత్వమే అంటాను నేను?? బిచ్చగాడు తన పొట్ట నింపుకోవడం కోసం తన మనసులోని వేదనని నాలుగు అక్షరాలుగా పేర్చి ఒక పాటగా మార్చి అడుక్కుంటూ ఉంటాడు ..అది కాదా కవిత్వం?? అమ్మ పాడే లాలిపాట కవిత్వమే, కోయిలమ్మ కూసే కూత కూడా కవిత్వమే.. అర్ధం చేసుకోగల మనసు ఉంటే..!!

అయ్యా సో కాల్డ్ పండిత పితామహుల్లారా.... మీ వల్లే తెలుగు భాషకి ఎక్కువ నష్టం జరుగుతోంది అన్న సంగతి మీకెప్పుడైనా అర్ధమైందా?? తెలుగు భాష తియ్యదనం గురించి చెప్పాలి అంటే సూటిగా బుర్రలోకి, మనసులోకి చొచ్చుకుపోయేలా నాలుగు మాటలు చెప్తే చాలు ఎవరికైనా... పేజీలకి పేజీలు గ్రాంధికంలో రాసి మాత్రమే చెప్పాల్సిన పనిలేదు... "తీపి తినాలని ఉంది అని ఎవడైనా అడిగితే, ఇంత చక్కెర వాడి నోట్లో వేస్తే చాలు... చెరుకు పంట వేసి, ఆ పంట చేతికొచ్చాక చెరుకు గడలని ఫాక్టరీకి పట్టుకెళ్లి దాని రాసం తీసి... ఎట్సెటర....ఎట్సెటర... ప్రోసెస్ అంతా అయ్యాక... చక్కెర తెచ్చి వాడి నోట్లో వేయాలి అనుకునే లోపు... వాడికి తీపి తినాలనే ఆశ చచ్చిపోతుంది...!! ఏంటి దానివల్ల నువ్వు ఉద్ధరించినది తెలుగు భాషని?? ఈ స్పీడ్ యుగంలో... తెలుగు కనుమరుగవుతున్న మాట వాస్తవమే... దాన్ని బ్రతికించే ప్రయత్నం చేయాలి అంటే... ఆ భాష ఎంత తీయనిదో, నేర్చుకోవడానికి ఎంత సులువైనదో... అందులో ఎంత మాధుర్యం ఉన్నదో ఇందాక చెప్పినట్టు నేరుగా వారి నోరు తెరిచి ఇంత తీపి తగిలించండి... అంతేకాని... గ్రాంధికం అంటూ... గాడిద గుడ్డు అంటూ బెదరగొడితే.... "అమ్మా" అని పిలవగలిగిన వాడు కూడా బెదిరిపోయి "మమ్మీ" అని పిలవడానికే అలవాటు పడతాడు.....!!

గ్రాంధికం,గాడిద గుడ్డు అన్నది... అవసరం ఉన్నవాడికి అనవసరమైన సహాయం చేయడంలో అర్ధం లేదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే కానీ, భాషని కించపరచాలి, 'పండితులం' అని అనుకునే వాళ్ళని తక్కువ చేయాలనో ఈ వ్యాసం యొక్క ఉద్దేశం కాదు.. క్లుప్తంగా చెప్పాలి అంటే.. "కవిత్వం కానీ, మరే ఇతర రచన కానీ... బాగుంది అన్నప్పుడు కేవలం పండితులు మాత్రమే ప్రశంసించే విధంగా ఉండటం కాదు... బాగోలేదు అన్నప్పుడు... పామరుడు సైతం విమర్శించేంత సులువుగా ఉంటేనే ఆ రచనకో అర్ధం ఉంటుంది ".


2 comments:

  1. నైస్ సత్య జి....నూతక్కి రాఘవేంద్ర రావు.

    ReplyDelete